గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పని తీరును మరింతగా పర్యవేక్షించేలా ప్రభుత్వం నిబంధనలు మార్చింది. మూడు సార్లు హాజరును ఇవాళ్టి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై నిఘా పెంచిన ప్రభుత్వం మరో కొత్త రూల్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇవాళ్టి నుంచి రోజుకు మూడు సార్లు హాజరు వేయాలని ఆదేశించింది.
ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా మూడు సార్ల హాజరు రూల్‌ను సచివాలయ ఉద్యోగులపై అమలు చేస్తోంది ప్రభుత్వం.
విధుల్లోకి వచ్చిన వెంటనే ఉదయం పది గంటలకు ఓసారి హాజరు వేయాలి. అదే సాయంత్రం మూడు గంటలకు రెండోసారి హాజరు వేయించుకోవాలి. సాయంత్రం ఇంటికి వెళ్లిపోయే ముందు ఐదు గంటలకు హాజరు వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
ఈ విధానం అమలు సజావుగా సాగేందుకు ప్రత్యేకమైన యాప్‌ను తీసుకొచ్చింది ప్రభుత్వం. దీని కోసం సొంత ఫోన్ గానీ, సచివాలయ ఫోన్లు కానీ ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
దీనిపై చాలా మంది సచివాలయ ఉద్యోగుల అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రొబేషన్‌పై ఎటూ తేల్చని ప్రభుత్వం రోజుకో కొత్త నిబంధనతో పొగబెడుతుందని ఆరోపిస్తున్నారు. ఒత్తిడి పెంచి వేధింపులకు గురి చేస్తున్నారి మండిపడుతున్నారు.
అధికారులు మాత్రం దీనిపై వేరేలా స్పందిస్తున్నారు. స్పందన కార్యక్రమానికి ఉద్యోగుల హాజరు తప్పని సరి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. చాలా మంది ఉదయం హాజరు వేసి వెళ్లిపోతున్నారని.. సాయంత్రానికి వచ్చి హాజరు వేస్తున్నారని చెప్పారు. మధ్యలో అడిగితే ఫీల్డ్ మీద ఉన్నామంటూ చెబుతున్నారన్నారు. ఈ లోపాన్ని సవరించేందుకే మూడు సార్లు హాజరు నిర్ణయాన్ని తీసుకున్నట్టు చెబుతున్నారు.
ఉద్యోగాలు వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా ఇంకా పర్మెంట్ చేయలేదని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు.
2019 అక్టోబర్‌లో ప్రభుత్వం వీరిని నియమకించింది. రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామని చెప్పింది. ఇప్పటిక వరకు దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జూన్‌లో కచ్చితంగా పర్మినెంట్ చేస్తామని జగన్ ప్రకటించారు.
ప్రభుత్వం ఈ మధ్య పెట్టిన పరీక్ష పాసైతేనే పర్మినెంట్ చేస్తామంటూ చెప్పారు. అందులో చాలా మంది ఫెయిల్ అయ్యారు. వాళ్లకు మళ్లీ పరీక్ష పెడుతునున్నారు. ఈ ప్రక్రియ పూర్తైతే పర్మినెంట్ అవుతుందని ప్రభుత్వాధికారులు వివరిస్తున్నారు.