Amma Vodi Scheme : అమ్మ ఒడిపై ఆంక్షల విధిస్తున్నారన్న వార్తలు వస్తుండడంతో మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. సీఎం జగన్ పథకాలపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..  అమ్మ ఒడిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీకి జగన్ శాశ్వత సీఎం అన్నారు. అమ్మఒడిపై  ఎల్లో మీడియా అసత్య ప్రచారాలు ఖండిస్తున్నానన్నారు. పేదలు ఉన్నత చదువులు చేరువ చేయడమే అమ్మఒడి లక్ష్యం అని స్పష్టం చేశారు. ఎక్కువ మందికి అమ్మఒడి పథకం చేరేలా అనేక వెసులుబాట్లు కల్పించామన్నారు. అమ్మ ఒడి పథకం లబ్దిదారుల్లో 81% శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉన్నారన్నారు. అమ్మఒడి పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. 


ఆరోపణలు కాదు ఆధారాలు చూపండి 


అమ్మఒడి పథకంపై టీడీపీ చేసేది అసత్య ప్రచారం అని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. ఒక్క పైసా అవినీతి జరగలేదని, ఆధారాలివిగో అంటూ కౌంటర్ ఇచ్చారు. అమ్మ ఒడి పథకంపై ప్రభుత్వం కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధించలేదని మంత్రి అన్నారు. చంద్రబాబు, లోకేశ్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ జగన్ నే తమ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. అమ్మ ఒడిపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆరోపిస్తున్న టీడీపీ ఆధారాలు చూపాలని మంత్రి డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ ఇలాంటి కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా అమ్మ ఒడి ద్వారా ఆర్థికసాయం అందించామన్నారు. వివిధ వర్గాలకు చెందిన 81 శాతం మహిళలకు అమ్మ ఒడి ద్వారా లబ్ది చేకూరిందన్నారు. 


మీడియాలో చక్కర్లు కొడుతున్న అమ్మ ఒడి ఆంక్షలు ఇవే!  


అమ్మ ఒడికి విద్యుత్ వినియోగం, అటెండెన్స్, జిల్లా పేర్లు ఇలా ప్రతి అంశం జాగ్రత్తగా పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక చేయబోతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికి సీరియస్‌గా తీసుకోని విద్యార్థుల హాజరను ఇకపై సీరియస్‌గా తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశించింది.  నవంబర్‌ 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు కచ్చితంగా 75 శాతం ఉండాలని స్పష్టం చేసింది. లేకుంటే అలాంటి వారికి అమ్మఒడి ప్రయోజనం ఉండబోదట. 


విద్యుత్త వాడకంపై కూడా అమ్మఒడి లబ్ధిదారులకు సరికొత్త స్లాబ్ తీసుకొచ్చింది. విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటిన ఫ్యామిలీకి అమ్మఒడి పథకం ప్రయోజనం ఉండదు. అమ్మఒడి పథకం లబ్ధిదారుల ఎంపికలో మరికొన్ని  నిబంధనలు కూడా చేర్చింది పాఠశాల విద్యాశాఖ. బియ్యం కార్డు కొత్తది ఉండాలని తేల్చి చెప్పింది. ఆధార్‌ కార్డులో కూడా అడ్రెస్‌ కొత్తదై ఉండాలి. విభజించిన జిల్లాల్లో ఎక్కడ ఉంటే అదే జిల్లా పేరు ఆధార్‌ కార్డులో ఉండాలి. అలా మార్చుకొని ఆధార్‌ కార్డు అప్‌డేట్ చేయించాలి.  బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్‌ లింక్‌ అయి ఉండాలి. లేకుంటే వెంటనే చేయించుకోవాలని సూచించింది విద్యాశాఖ. బ్యాంకు ఖాతా లైవ్‌లో ఉందోలేదో చెక్‌ చేసుకున్న తర్వాత ఆ నెంబర్‌ను అమ్మ ఒడి పథకానికి ఇవ్వాలి