Rains In Telangana: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా తుఫాను తాజాగా కోస్తాంధ్ర, పశ్చిమ కేంద్ర బంగాళాఖాతంలో ఉంది. సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, నైరుతి దిశగా వంగి ఉంటుంది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మీదుగా షియర్ జోన్ కొనసాగుతోంది. ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్లు, 7.6 కిలోమీటర్లు ఎత్తుతో దక్షిణం వైపునకు వంగి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో నేడు ఏపీలో మరో నాలుగైదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాల కారణంగా ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తీరం వెంట బలమైన గాలులు గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మరో నాలుగైదు రోజులపాటు చేపల వేట మానేయాలని సూచించారు.
ఆగస్టు 7న అల్పపీడనం..
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు 7న అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తెలంగాణలోనూ మరో నాలుగైదు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.





తెలంగాణలో భారీ వర్షాలు
రాష్ట్రంలో ఆగస్టు 10 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగరి, వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవనుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 


ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సిద్దిపేట, వికారబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఆగస్టు 10 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
రేపు ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీస్తాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు యానాంలోనూ వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ ప్రాంతాల్లో ఆగస్టు 8 వరకు వర్షాలు కురువనున్నాయి.





దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆగస్టు 7 వరకు ఓ మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడతారని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.