భజరంగ్ పునియా పురోగతి నెమ్మదిగా ఉన్నప్పటికీ కచ్చితంగా భారతదేశంలోని అత్యుత్తమ రెజ్లర్లలో ఒకరిగా మారుతున్నారు. హర్యానాకు చెందిన ఈ 28 ఏళ్ల రెజ్లర్ పురుషుల 65 కేజీల విభాగంలో తన రెండవ కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
బర్మింగ్‌హామ్‌లో జరిగిన స్వర్ణంతో కామన్వెల్త్ గేమ్స్‌లో హ్యాట్రిక్ పతకాలను సాధించాడు. మూడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలను గెలుచుకున్న ఏకైక భారతీయుడిగా పోడియం పై మెట్టుపై నిలబడ్డాడు. కెనడాకు చెందిన 21 ఏళ్ల లచ్‌లాన్ మెక్‌నీల్‌పై గెలిచిన భజరంగ్ స్వర్ణం సాధించాడు.
భజరంగ్ ఫైనల్‌కు చేరుకునే దారిలో ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. అయితే ఫైనల్లో మాత్రం మెక్‌నీల్‌కు 2 పాయింట్లు సమర్పించుకున్నాడు. మిడ్ బౌట్ ఇంటర్వెల్ సమయానికి భజరంగ్ 4-0 ఆధిక్యంతో నిలిచింది. రెండవ పీరియడ్‌లో టేక్‌డౌన్ ద్వారా మెక్‌నీల్ 2 పాయింట్లను సాధించాడు. అయితే భజరంగ్ తన అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించాడు. చివరికి 9-2తో మెక్‌నీల్‌ను ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
టోక్యో గేమ్స్‌లో దూకుడుగా ఆడనందుకు భారత రెజ్లర్ భజరంగ్ పునియాపై విమర్శలు వచ్చాయి. పదేపదే తిరగబడుతున్న మోకాలి గాయం కూడా తన ఫాంపై ప్రభావం చూపించింది. అయితే శుక్రవారం భజరంగ్ స్వర్ణం కోసం నెగిటివిటీని పక్కనపెట్టి వచ్చాడు.
భజరంగ్ పునియా సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్ రామ్‌పై నిప్పులు చెరిగాడు. టెక్నికల్ సుపీరియారిటీ ద్వారా (ప్రత్యర్థి ఎలాంటి పాయింట్ సాధించకుండా) అతనిని మట్టికరిపించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో 65 కేజీల విభాగంలో క్వార్టర్‌ఫైనల్‌కు వెళ్లేందుకు భజరంగ్ పునియాకు రెండు నిమిషాలు కూడా పట్టలేదు. అతను తన ప్రారంభ బౌట్‌లో లోవ్ బింగ్‌హామ్‌ను ఓడించాడు. తర్వాత మారిషస్‌కు చెందిన జీన్ గైలియన్ జోరిస్ బాండౌను 6-0తో ఓడించి సెమీఫైనల్‌లో స్థానం సంపాదించాడు.
65 కేజీల విభాగంలో ప్రపంచ స్థాయి రెజ్లర్లలో ఒకరిగా నిలిచిన భజరంగ్, టోక్యో ఒలింపిక్స్‌కు ఫేవరెట్‌గా వెళ్లినప్పటికీ బంగారు పతకాన్ని కోల్పోయాడు. ఆ గేమ్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత భజరంగ్ ఒలింపిక్స్‌కు మోకాలి గాయంతో వెళ్లినట్లు వెల్లడించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో 2024 ప్యారిస్ ఒలంపిక్స్‌పై భజరంగ్ ఆశలు పెంచాడు.