Breaking News Live Telugu Updates: హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత, నాలుగు గంటలుగా రోడ్డుపై కూర్చొని షర్మిల నిరసన  

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 09 Dec 2022 07:56 PM
హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత, నాలుగు గంటలుగా రోడ్డుపై షర్మిల నిరసన  

హైదరాబాద్ లోటస్ పాండ్ వద్ద ఉద్రికత్త నెలకొంది. నాలుగు గంటలుగా రోడ్డుపై బైఠాయించి షర్మిల నిరసన తెలుపుతున్నారు. లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. నిరసన విరమించాలని పోలీసులు షర్మిలను కోరారు. అందుకు ఆమెకు నిరాకరించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇచ్చేవరకు తన నిరసన కొనసాగుతోందని షర్మిల అంటున్నారు.  

YS Sharmila News: వైఎస్ షర్మిల నిరసన

  • ప్రజాప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన వైయస్ షర్మిల

  • రాష్ట్రంలో కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు

  • ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారు. బేడీలు వేస్తున్నారు

  • ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది పోయి ఇలా అణగదొక్కడం భావ్యమేనా? అంటూ షర్మిల వ్యాఖ్యలు

KCR Comments: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్దతు - కేసీఆర్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వనుంది. ఆ రాష్ట్రంలో జేడీఎస్‌తో కలిసి తాము పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అబ్ కీ బార్ కిసాన్ కా సర్కార్ అనే నినాదంతో ముందుకు వెళ్లనున్నట్లుగా కేసీఆర్ చెప్పారు.

Transgenders Protest: ట్రాన్స్ జెండర్ల కొత్త డిమాండ్

వరంగల్ లో ట్రాన్స్ జెండర్లు సరికొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్లో తమకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రస్తుతం జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో యువతీ యువకులకు వేరు వేరుగా ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లే.. తమకు ప్రత్యేక కోటా కేటాయించాలని ట్రాన్స్ జెండర్స్ కోరారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్కు ట్రాన్స్ జెండర్స్ వినతి పత్రం ఇవ్వనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రాత పరీక్షలకు 12 మంది ట్రాన్స్ జెండర్స్ హాజరయ్యారు. రాత పరీక్షల్లో నందిని, తనుశ్రీ, లవ్ లీ, శ్రావ్య శ్రీ అనే నలుగురు ట్రాన్స్ జెండర్స్ పాసై.. ఈవెంట్స్కు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉద్యోగ నియమకాలలో ట్రాన్స్ జెండర్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Hyderabad News: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చుక్కలు

హైదరాబాద్ చంపాపేట్ మనసా గార్డెన్ వద్ద డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో మందు బాబుల వ్యవహారం ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. చంపాపేట ప్రధాన రహదారిపై మీర్ చౌక్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ తనిఖీలలో మందుబాబులు వీరంగం చేశారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించే పోలీసులతో విచిత్రంగా వ్యవహరిoచారు. రోడ్డుపై తనిఖీలను చూసి వాహనాలను వదిలి పారిపోయారు. మరి కొందరు వాహనాలతో పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్లారు. వారిని వెంబడించి పట్టుకుని తనిఖీలు చేసి పోలీసులు కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ కొందరైతే సెల్ ఫోన్లతో వీడియోలు తీస్తూ.. ట్రాఫిక్ పోలీసులు దౌర్జన్యంగా వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.

kakinada News: కాకినాడలో భారీ బ్లాస్టింగ్, భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పైడిపాలలో బ్లాస్టింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. క్వారీలో నిర్వహకులు పేలుడు పదార్థాలు ఏర్పాటు చేయగా, అటుగా వెళ్తున్న వారిపై రాళ్లు పడ్డాయి. సర్వే నెంబర్ 15 లో నిర్వహిస్తున్న అనుమతులు లేని క్వారీలో బ్లాస్టింగ్ జరిగింది. అనుమతులు లేకుండా క్వారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆందోళన చెందారు. చనిపోయిన వారిలో భార్య భర్తలు పాలోజు వరాలు, దుర్గా భవాని ఉన్నారు.

Background

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను పట్ల ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాల జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్ జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలక్టర్లను ఆదేశించారు. తుపాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలపై తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల కలక్టర్లతో వీడియో సమావేశం ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ డా.జవహర్ రెడ్డి మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం మాండస్ తుపాను ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి నాటికి పుదుచ్చేరి, మహా బలిపురం, శ్రీహరికోటల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రభావంతో ఈ నెల 10వ తేదీ వరకూ రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కావున ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.


ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లాల్లో ఒకటి, నెల్లూరు జిల్లాలో 2, తిరుపతి జిల్లాలో 1, చిత్తూరు జిల్లాలో 1 మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించడం జరిగిందని సీఎస్ డా.జవహర్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఒకటి వంతున మొత్తం 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. వర్షాలు, భారీ వర్షాలతో ఎక్కడైనా రహదారులకు లేదా ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇబ్బందులు తలెత్తితే సత్వర చర్యలు తీసుకునేలా సర్వసన్నద్ధమై ఉండాలని సీఎస్ డా. జవహర్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఆయా జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.


తుపాను ప్రస్తుత స్థితి ఇదీ
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రవైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా "మాండోస్" గా ఉచ్ఛరించిన తీవ్ర తుపాను దాదాపు 12 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా వెళ్లి నైరుతి మీదుగా పయనిస్తోంది. ట్రింకోమలీ (శ్రీలంక)కి ఉత్తర-ఈశాన్యంగా 240 కి.మీ., జాఫ్నాకు 270 కి.మీ తూర్పు-ఈశాన్య (శ్రీలంక), కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 270 కి.మీ, చెన్నైకి ఆగ్నేయంలో 350 కి.మీ. వద్ద కేంద్రీకృతమై ఉంది.


మాండోస్‌ ఈ రోజు తీవ్ర తుపానుగా మారనుంది.  సాయంత్రానికి క్రమంగా బలహీనపడి తుపానుగా మారే అవకాశం ఉంది. పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం వద్ద తీరం దాటనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలపై ప్రభావం చూపనుంది. ఈ రోజు అర్ధరాత్రి గరిష్టంగా 65-75 కిలోమీటర్ల వేగంతో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.


జాతీయ రహదార్లు, రాష్ట్ర రహదారులకు భూసేకరణపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష
రాష్ట్రానికి కొత్తగా మంజూరైన విజయవాడ-కడప-బెంగుళూర్ జాతీయ రహదారి, అనంతపురం-గుంటూరు జాతీయ రహదారి, విశాఖపట్నం-భోగాపురం-రాయపూర్ 6 వరుసల జాతీయ రహదారి సహా ఇతర జాతీయ రహదార్లు, రాష్ట్ర హైవేలకు సంబంధించిన భూసేకరణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి 26 జిల్లాల కలక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కొత్తగా మంజూరైన వివిధ జాతీయ రహదార్లు, రాష్ట్ర హైవేల నిర్మాణానికి సంబంధించి త్వరితగతిన భూసేకరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిర్దేశిత గడువు ప్రకారం భూసేకరణ చేసి అప్పగించేందుకు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎస్ డా.జవహర్ రెడ్డి ఆదేశించారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.