Life of a Karma Yogi : అధికారులు ఎంత నిబద్ధతతో పని చేస్తే ప్రభుత్వం చేపట్టిన పథకాలు అంత విజయవంతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన ‘లైఫ్‌ ఆఫ్ ఏ కర్మ యోగి- మెమైర్‌ ఆఫ్‌ ఏ సివిల్‌ సర్వెంట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు హైదరాబాద్ లోని బేగంపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో ఎంత తిరిగితే అంత మంచిదన్నారు. కానీ ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులు  క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సుముఖంగా లేరని, ఏసీ గదుల వీడేందుకు  ఇష్టపడడం లేదని చెప్పుకొచ్చారు.


‘‘నిబద్ధత కలిగినటువంటి అధికారులను గుర్తించి వారికి ప్రాధాన్యత ఇస్తున్నాం. పాలకులు ఎన్ని పాలసీలు చేపట్టినా.. అమలు చేసేది మాత్రం అధికారులే. క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన అధికారులను ప్రజలూ గుర్తుంచుకుంటారు. మనకున్న జ్ఞానం, అధికారం పేదలకు ఉపయోగపడాలి’’ అని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతి కుమారి, పలువురు ఉన్నతాధికారులు పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు.


Also Read :Left Parties Protest: కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ఈనెల 18,19 తేదీల్లో దేశవ్యాప్తంగా వామపక్షాల నిరసన


 
గోపాలకృష్ణ అనుభావాలే ఈ పుస్తకం
గోపాలకృష్ణ గారి అనుభవాలను ఈ పుస్తకంలో నిక్షిప్తం చేయడం సంతోషమని రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు దశాబ్దాల తన అనుభవాన్ని నిక్షిప్తం చేయడం పెద్ద టాస్క్ . ఏదైనా కొనవచ్చు కానీ ఎక్స్పీరియన్స్ ను కొనలేమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  సివిల్ సర్వెంట్స్ అందరికీ ఈ పుస్తకం ఒక దిక్సూచిగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశంలో వేగంగా జరిగిన మార్పులకు ఆయన ప్రత్యక్ష సాక్షి అన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను మనం గుర్తు చేసుకోవాలి. వారు శంకరన్, శేషన్, మన్మోహన్ సింగ్ అని అన్నారు రేవంత్ రెడ్డి.


ఈ రోజుల్లో అది తగ్గిపోయింది
నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్ . పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి శేషన్. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి  మన్మోహన్ సింగ్  అని రేవంత్ అన్నారు.వారి అనుభవాల నుంచి సివిల్ సర్వెంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది . గతంలో అధికారులు రాజకీయ నాయకులు అంశాలను ప్రస్తావిస్తే అందులోని లోటుపాట్లు, లాభ నష్టాలను వివరించే వారని సీఎం తెలిపారు.కానీ ఈ రోజుల్లో ఎందుకో అది తగ్గిపోయిందన్నారు. 


 


Also Read :Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన రాజేంద్ర ప్రసాద్ - ఇరువురి ఆత్మీయ ఆలింగనం



నిత్యం ప్రజల్లో ఉండాలి
రాజకీయ నిర్ణయాలపై నాయకులకు అధికారులు విశ్లేషణ చేసి చెప్పాలి. గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారు. రాజకీయ నాయకుల కంటే ప్రజలు అధికారులను ఎక్కువ గుర్తుంచుకునేవారని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు.  కానీ ఇప్పుడు కలెక్టర్లు ఏసీ రూముల్లోంచే బయటకు వెళ్లడం లేదన్నారు సీఎం. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు.  పేదలకు సాయం చేయాలన్న ఆలోచన అధికారులకు ఉండాలి. అలాంటి వారే ప్రజల మనసులో ఎక్కువకాలం గుర్తుంటారు. ఆ దిశగా రాష్ట్రంలో అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి  తెలిపారు.