Budget: కేంద్ర బడ్జెట్‌ బడా వ్యాపారులకు అనుకూలంగా ఉంది తప్ప...సామాన్య ప్రజలకు దీనివల్ల ఒరిగిందేమీ లేదని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. దీన్ని నిరసిస్తూ ఈనెల18, 19 తేదీల్లో పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నాయి.

 

సంపన్నుల బడ్జెట్

ప్రధాని నరేంద్రమోడీ(Modi) నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం ..పేదలు, మధ్యతరగతి ప్రజలకు కల్పించాల్సిన మౌలికవసతుల్లో కోతలు విధించి...సంపన్నులకు రాయితీలు ప్రకటించిందని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. బడ్జెట్‌(Budget)లో సామాన్యులకు తీరం ద్రోహం జరిగిందని విమర్శించాయి.ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పాయి.  ఈ బడ్జెట్‌కు  ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రూపొందించి ప్రజల మద్దతు కూడగడతామని ఆ పార్టీ   నేతలు తెలిపారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను నిరసిస్తూ అఖిలభారత వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈనెల 18,19 తేదీల్లో తెలంగాణ(Telangana) రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన  ప్రదర్శనలు నిర్వహించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.

 

వామపక్షాల డిమాండ్లు

దేశంలోని శతకోటీశ్వరులపై  4శాతం అదనంగా పన్ను పెంచడంతోపాటు, కార్పొరేట్ (Corporate)పన్ను సైతం పెంచాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు కల్పించాలని కోరాయి. బీమా రంగంలో వందశాతం విదేశీ పెట్టుబడులను (FDI) ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం మానుకోవాలని  హితవు పలికాయి.అలాగే ప్రభుత్వ ఆస్తులను  ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టడం  సరికాదని విమర్శించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పనులు లేక పస్తులుంటున్నారని ఈ నేపథ్యంలో గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రెట్టింపు నిధులు పెంచాలని కోరాయి. ఉపాధిహామీ పథకం కేవలం గ్రామీణ ప్రాంతాలకే అమలు చేస్తున్నారని....పట్టణాల్లోనూ  చాలామంది పేదలు దుర్భర జీవితం గడుపుతున్నారని వారికి కూడా ఉపాధిహామీ పథకం వర్తింప జేయాలని వామపక్ష నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఎంతో కీలకమైన ఆరోగ్య,విద్యారంగానికి జీడీపీ(GDP)లో  3శాతం కేటాయింపులు చేయాలని కోరారు. ప్రజాపంపిణీ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఆహార సబ్సీడీ పెంపుతోపాటు, ఎస్సీ-ఎస్టీరంగాలకు,మహిళా శిశు సంక్షేమ రంగాలకు  కేటాయింపులు భారీగా పెంచాలని నేతలు కోరారు. స్కీమ్ వర్కర్ల గౌరవ వేతనంలో  కేంద్రం వాటా పెంచడంతోపాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇస్తున నిధుల వాటాను సైతం పెంచాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.  పెట్రోలియం ఉత్పత్తులపై సెస్సులు, సర్‌ఛార్జీలు రద్దు చేయాలని కోరాయి. ఈ ప్రత్యామ్నా  ప్రతిపాదనలతో  పార్లమెంట్‌లో బడ్జెట్‌ బిల్లు ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.

 

వామపక్షాల నిరసన

ఈనెల18,19న జరిగే నిరసన కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్‌), సీపీఐ( ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ, ఎంసీపీఐ, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఎస్‌యుసిఐ(సి), సిపిఐ(ఎంఎల్‌) లిబరేషన్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలు పాల్గొననున్నాయి. పెద్దసంఖ్యలో వామపక్ష కార్యకర్తలు ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా  శాంతియుతంగా  నిరసన తెలియజేయాలని కోరాయి. డిల్లీకి వినిపించేలా ఎర్రసైన్యం నినదించాలన్నారు.రాష్ట్రప్రజలు సైతం  వామపక్షాలకు  మద్దతు పలకాలని కోరాయి. వామపక్షాల నిరసనతో కేంద్రం ప్రభుత్వం దిగిరాకుంటే...ప్రజా ఉద్యమాలు మరింత బలంగా నిర్వహిస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు. కేంద్రం చేస్తున్న  అన్యాయాన్ని  ప్రజలకు వివరించి తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.