LIC Kanya Daan Policy Details In Telugu: మన దేశంలో ఆడపిల్లను మహాలక్ష్మిగా భావిస్తారు. అయితే, ఆడపిల్ల పుట్టిందంటే బెంగ పెట్టుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పేదరికం వల్ల వాళ్ల ఆలోచనల తీరు ఇలా ఉండొచ్చు. పెరుగుతున్న విద్య & వివాహ ఖర్చులు ఆడబిడ్డ తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి, కూతురి భవిష్యత్తుపై ఆందోళనలు పెంచుతున్నాయి. ఈ టెన్షన్ తగ్గించడానికి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కన్యాదాన్ పాలసీని తీసుకొచ్చింది. ఇది, ఆడపిల్లలకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు డిజైన్ చేసిన ప్రత్యేక పథకం.
ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ అంటే ఏమిటి?
LIC కన్యాదాన్ పాలసీ అనేది దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. తమ కుమార్తె జీవితంలోని కీలక అడుగుల కోసం డబ్బును దాచి పెట్టేందుకు తల్లిదండ్రులకు ఈ పథకం సాయం చేస్తుంది. 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వయస్సు గల బాలికల కోసం ఈ పాలసీ అందుబాటులో ఉంది. మెచ్యూరిటీ మొత్తంగా రూ. 22.5 లక్షల వరకు చేతికి వస్ుతంది. పాలసీ వ్యవధి 13 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. పేద & దిగువ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రీమియం చెల్లింపుల్లోనూ సౌలభ్యం ఉంటుంది.
చెల్లింపుల్లో సౌలభ్యం: LIC కన్యాదాన్ పాలసీ ప్రీమియం డబ్బును నెలవారీ లేదా త్రైమాసికానికి ఒకసారి లేదా అర్ధ-వార్షిక పద్ధతిలో లేదా ఒకేసారి ఏడాది కోసం చెల్లించవచ్చు.
మెచ్యూరిటీ ప్రయోజనాలు: పాలసీ వ్యవధి ముగియగానే, ఈ పథకం నిబంధనల ప్రకారం వర్తించే బోనస్‌లతో పాటు హామీ మొత్తం పాలసీదారు చేతికి అందుతుంది.
అర్హత: ఈ పాలసీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి తండ్రికి 50 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.
LIC కన్యాదాన్ పాలసీ ప్రయోజనాలు:
రుణ సౌకర్యం: పాలసీ యాక్టివేషన్ అయిన మూడు సంవత్సరాల తర్వాత, ఈ పాలసీపై రుణం కూడా తీసుకోవచ్చు.
సరెండర్ ఆప్షన్: మీరు ఈ పాలసీని వద్దనుకుంటే, పాలసీ ప్రారంభమైన రెండు సంవత్సరాల తర్వాత సరెండర్ చేయవచ్చు.
గ్రేస్ పీరియడ్: ఏ కారణం వల్లనైనా ప్రీమియం చెల్లింపు మిస్ అయితే, జరిమానా లేకుండా చెల్లించడానికి అదనంగా 30 రోజుల సమయం ఉంటుంది.
పన్ను ప్రయోజనాలు: LIC కన్యాదాన్ పాలసీ ప్రీమియం చెల్లింపులను ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద తగ్గింపుల కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేకాదు, పాలసీ మెచ్యూరిటీ మొత్తం సెక్షన్ 10D కింద పూర్తిగా పన్ను రహితం.
పెట్టుబడి & రాబడి:
25 సంవత్సరాల కాలానికి మీరు పాలసీని కొనుగోలు చేస్తే, 22 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఈ 22 సంవత్సరాల పాటు, ఏడాదికి రూ. 41,367 (నెలకు సుమారు రూ.3,447) వార్షిక ప్రీమియం చెల్లిస్తే, పాలసీ మెచ్యూరిటీ తర్వాత మీరు దాదాపు రూ. 22.5 లక్షలు అందుకుంటారు.
డెత్ బెనిఫిట్స్:
దురదృష్టవశాత్తు, పాలసీ కొనసాగుతున్న సమయంలో తండ్రి మరణిస్తే, భవిష్యత్తులో చెల్లించాల్సిన అన్ని ప్రీమియంలు మాఫీ అవుతాయి. పాలసీ మెచ్యూరిటీ వరకు అతని కుమార్తెకు ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లయితే, నామినీకి అదనంగా 10 లక్షల రూపాయలను LIC చెల్లిస్తుంది.
LIC కన్యాదన్ పాలసీని ఎందుకు ఎంచుకోవాలి?
ఈ పాలసీ, మీ కుమార్తె విద్య, వివాహం వంటి కీలక సమయాల్లో ఆర్థికంగా అండగా నిలబడుతుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ధర ప్రీమియంలు & మంచి ప్రయోజనాలతో మీ కుమార్తె భవిష్యత్ కోసం నమ్మకమైన పెట్టుబడిగా పని కొస్తుందని చెబుతున్నారు.
మరో ఆసక్తికర కథనం: 'నేను SBI నుంచి మాట్లాడుతున్నా' - క్రెడిట్ కార్డ్ మోసాల్లో కొత్త పద్ధతి, జాగ్రత్త సుమా!