Inactive Credit Account: మన దేశంలో చాలామంది దగ్గర ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లు ఉంటాయి. అయితే, అన్ని క్రెడిట్ కార్డ్‌లను ఆ వ్యక్తులు ఉపయోగించకపోవచ్చు. తరచూ ఒక్క కార్డ్‌ను మాత్రమే వినియోగిస్తూ, మిగిలిన కార్డ్/కార్డ్‌లను పూర్తిగా పక్కన పడేస్తుంటారు లేదా చాలా ఎక్కువ గ్యాప్ తర్వాత ఉపయోగిస్తుంటారు. క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించకపోతే, దానికి బకాయి ఉండదు కాబట్టి ఎలాంటి నష్టం జరగదని భావిస్తుంటారు. అది పూర్తిగా నిజం కాదు. ఉపయోగించని క్రెడిట్ కార్డ్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అవి మీ క్రెడిట్ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
అకౌంట్ క్లోజ్ కావచ్చు!మీరు మీ క్రెడిట్ కార్డును ఎక్కువ కాలం ఉపయోగించకపోతే అది నిష్క్రియంగా (Inactive) మారుతుంది. సాధారణంగా, ఒక క్రెడిట్ కార్డును ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు ఉపయోగించకపోతే అది ఇన్‌యాక్టివ్ కార్డ్ కేటగిరీ కిందకు మారుతుంది. అయితే, ఇలా జరగడానికి ముందు, ఆ క్రెడిట్ కార్డ్ జారీ చేసిన బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ మిమ్మల్ని సంప్రదిస్తుంది. ఆ కార్డ్‌ను తిరిగి యాక్టివేట్ చేయడానికి మీకు అవకాశం ఇస్తుంది. ఏ కారణం వల్లనైనా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోకపోతే, మీ క్రెడిట్ అకౌంట్‌ను ఇన్‌యాక్టివ్ విభాగం కిందకు మారుస్తుంది లేదా క్లోజ్ చేసే అవకాశం ఉంది.
క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావంబ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ మీ క్రెడిట్ ఖాతాను మూసివేస్తే, అది మీ క్రెడిట్ స్కోర్ (Credit Score)పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్రెడిట్ ఖాతాను మూసివేయడం వల్ల మీ ప్రస్తుత క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. అంతేకాదు, మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరిగే అవకాశం ఉంది. మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలంటే, మీ క్రెడిట్ వినియోగం సాధారణంగా మీ క్రెడిట్ పరిమితిలో 30 శాతానికి మించకూడదు. ఒక కార్డ్ క్లోజ్ అయితే, మిగిలిన కార్డ్/కార్డ్‌లపై మీరు ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఆ కార్డ్/కార్డ్‌ల ద్వారా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల క్రెడిట్ వినియోగ నిష్పత్తి పెరుగుతుంది, అది మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించవచ్చు.
ఈ ప్రయోజనాలు కూడా మిస్ అవుతారుక్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించకపోవడం అంటే మీరు రివార్డులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, లాంజ్ యాక్సెస్ వంటి సౌకర్యాలను కోల్పోతున్నట్లే. మీ కార్డ్ చాలా కాలం పాటు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే, మీరు సేకరించిన రివార్డులు, పాయింట్లు, ఆఫర్‌ల గడువు కూడా ముగియవచ్చు.
ఇక్కడ ఒక గుడ్‌న్యూస్ ఏమిటంటే, మన దేశంలోని క్రెడిట్ కార్డ్ జారీ చేసే సంస్థలు, ఆ కార్డును ఉపయోగించకపోతే రుసుములు లేదా జరిమానాను వసూలు చేయవు. అయితే, దీని గురించి మరింత సమాచారం కోసం క్రెడిట్ కార్డ్ జారీ చేసే కంపెనీ కస్టమర్ కేర్ విభాగాన్ని సంప్రదించాలి.
క్రెడిట్ కార్డ్ యూజర్లకు కీలక సూచనలు
- క్రెడిట్ కార్డ్ యాక్టివ్‌గా ఉండాలంటే, కనీసం మూడు నెలలకైనా ఒక చిన్న లావాదేవీ చేయండి.
- మీ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి, అనుమానిత లావాదేవీలు & ఛార్జీలు ఉన్నాయేమో గమనించండి.
- మీకు క్రెడిట్ కార్డ్ అవసరం లేకపోతే, కార్డ్‌ను జారీ చేసిన సంస్థను సంప్రదించి దానిని క్లోజ్ చేయండి.
- ఒకవేళ మీ కార్డ్ ఇప్పటికీ క్రియారహితంగా ఉంటే, దానిని తిరిగి యాక్టివేట్ చేయడానికి మీ బ్యాంక్/ఆర్థిక సంస్థను సంప్రదించండి.
మరో ఆసక్తికర కథనం: 'నేను SBI నుంచి మాట్లాడుతున్నా' - క్రెడిట్ కార్డ్ మోసాల్లో కొత్త పద్ధతి, జాగ్రత్త సుమా!