Cyber Fraud: క్రెడిట్ కార్డ్‌ పేరిట స్కామర్లు చేసే కొత్త మోసం కేసు వెలుగులోకి వచ్చింది. దీని గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు, కానీ కూడా అప్రమత్తం కూడా అవుతారు. ఈ కొత్త మోసం పద్ధతిలో, స్కామర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులమని చెప్పుకుంటూ ప్రజలకు ఫోన్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతామని ఊరిస్తూ, కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లతో గాలం వేస్తున్నారు.


మోసం గురించి వెల్లడించిన రెడ్డిట్‌ యూజర్‌
Fresh_Journalist5116 ID ఉన్న రెడ్డిట్ (Reddit) యూజర్ ఒకరు ఈ ఆన్‌లైన్‌ ఫ్రాడ్‌ గురించి షేర్‌ చేశాడు. అతని తండ్రి ఈ మోసానికి బలైపోయేవాడని, చివరి నిమిషంలో బయటపడ్డామని వెల్లడించాడు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఉద్యోగిగా నటిస్తూ, స్కామర్ తన తండ్రికి ఫోన్‌ చేశాడని, ఒక లింక్‌ కూడా పంపాడని రెడ్డిట్ యూజర్‌ వెల్లడించాడు.


అతను చెప్పిన వివరాల ప్రకారం, రెడ్డిట్ యూజర్‌ తండ్రికి ఒక ఫోన్‌ కాల్‌ వచ్చింది. అవతలి వ్యక్తి, తాను స్టేట్‌ బ్యాంక్‌ ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. బ్యాంక్‌ తన కస్టమర్లకు ఇస్తున్న ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా, తన తండ్రి వాడుతున్న ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ పరిమితిని పెంచుతామని అవతలి వ్యక్తి చెప్పాడు. అంతేకాదు, ఆ క్రెడిట్ కార్డుపై విధించిన వార్షిక రుసుములను కూడా రద్దు చేయవచ్చని ఆశ పెట్టాడు. దీని కోసం e-KYC అప్‌డేట్ చేయాలని సూచించాడు. ఈ తన తండ్రి దాదాపుగా అతని ఉచ్చులో పడ్డాడని రెడ్డిట్‌ యూజర్‌ వెల్లడించాడు. కానీ, తనకు అనుమానం రావడంతో ఆ మోసగాడి పన్నాగం పారలేదని చెప్పాడు. తనకు ఎందుకు అనుమానం వచ్చిందో కూడా రెడ్డిట్‌ యూజర్‌ వివరించాడు.


రెడ్డిట్‌ యూజర్‌కు వచ్చిన అనుమానం ఇదీ..
స్కామర్ మాటలను తన తండ్రి నమ్మగానే, అతను e-KYC అప్‌డేట్ పేరుతో తన తండ్రి మొబైల్‌ నంబర్‌కు ఒక లింక్‌ పంపాడు. అదృష్టవశాత్తు, ఆ లింక్‌ను రెడ్డిట్ యూజర్ కూడా చూశాడు. ఆ లింక్ URL wixsite.com తో ముగియడం గమనించాడు. ఇక్కడే రెడ్డిట్‌ యూజర్‌కు అనుమానం వచ్చింది. ఏదో తప్పు జరుగుతోందని భావించాడు. వెబ్‌సైట్ పేజీలోనూ చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్‌ ఉండడం అతను గమనించాడు. 


"నేను ఆ వెబ్‌సైట్‌ను తనిఖీ చేశాను. ఆ వెబ్‌సైట్‌ నకిలీదని అర్ధమైంది. పైభాగంలో WIX సైట్ కోసం ఒక ప్రకటన ఉంది & URL కూడా wixsite.com తో ముగిసింది. అంటే, ఈ సైట్‌ను WIXలో డెవలప్‌ చేసి ఉండవచ్చు. అంతేకాదు, తరువాతి పేజీలో 'Expari date', Intar OTP' వంటి స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి" - రెడ్డిట్‌ యూజర్‌ 


మరో తప్పుతో అనుమానం నిజం చేసిన స్కామర్ 
SBI ఉద్యోగి పేరుతో స్కామర్ పంపిన ID కార్డు కూడా నకిలీదని రెడ్డిట్‌ యూజర్‌ గుర్తించాడు. ఎందుకంటే, ఆ ఐడీ కార్డ్‌లోని కార్యాలయ చిరునామా సరైనది కాదు. ఈ తప్పును కూడా పట్టుకున్న రెడ్డిట్‌ యూజర్‌, తన తండ్రికి ఫోన్‌ చేసిన వ్యక్తి మోసగాడని నిర్ధారించుకున్నాడు. దీంతో, మోసం బారిన పడకుండా చివరి నిమిషంలో తన తండ్రిని రక్షించాడు.  


మన దేశంలో, క్రెడిట్ కార్డ్, డెబిట్‌ కార్డ్‌ అప్‌డేట్స్‌, ఇతర ఆఫర్ల పేరిట చాలా మోసం కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వీటి గురించి రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సహా అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. కస్టమర్‌ అప్రమత్తత మాత్రమే అతని కష్టార్జితాన్ని రక్షిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: ELI స్కీమ్‌ కోసం UAN యాక్టివేట్ చేయడానికి ఇదే చివరి తేదీ - మిస్‌ చేస్తే రూ.15,000 పోతాయ్‌!