Activate UAN For EPFO ELI Scheme: ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ (EPFO) కింద ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకాన్ని పొందడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను యాక్టివేట్ చేయాలి. UANను యాక్టివేట్‌ చేయడానికి & మీ బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ 15 ఫిబ్రవరి 2025. ఈ నెల 02న EPFO జారీ చేసిన సర్క్యులర్‌లో, UAN యాక్టివేషన్ & బ్యాంకు ఖాతాలో ఆధార్ సీడింగ్ కోసం తుది గడువును 15 ఫిబ్రవరి 2025 వరకు పొడిగించిందని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. 


యూఏఎన్‌ అంటే ఏమిటి?


UAN అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (Universal Account Number). ఇది, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees' Provident Fund Organisation) ద్వారా కంపెనీ యాజమాన్యం & ఉద్యోగి ఇద్దరికీ జారీ అయిన 12 అంకెల సంఖ్య, ఈ సంఖ్య ద్వారా ఆ ఇద్దరూ ఉద్యోగి EPF ఖాతాకు తమ సహకారాన్ని (Contribution) అందిస్తారు. UAN సహాయంతో, ఉద్యోగి తన EPFO ఖాతాను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడమే కాకుండా దానిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. 


ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం (ELI) అంటే ఏమిటి?


కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగుల కోసం ప్రారంభించిన స్కీమ్‌ - 'ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం' ‍‌(Employment Linked Incentive Scheme). మొదటి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు, ఈ పథకం కింద, కేంద్ర ప్రభుత్వం ఒక నెల జీతం రూపంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అందిస్తుంది. మూడు విడతలుగా ఇచ్చే ఈ మొత్తం గరిష్ట పరిమితి రూ. 15,000. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే, ఉద్యోగి నెలవారీ జీతం లక్ష రూపాయలకు మించకూడదు. ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహకం నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్‌ ఖాతాకు వెళుతుంది, కాబట్టి ఆధార్ ఆధారిత OTP ద్వారా UANను యాక్టివేట్ చేయడం & బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయడం అవసరం. 


UANను ఎలా యాక్టివేట్ చేయాలి? (How to activate UAN?)


ముందుగా యూనిఫైడ్ ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్ unifiedportal-mem.epfindia.gov.in లోకి వెళ్లండి.
మీకు కుడి దిగువన Important Link అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ కనిపించే Activate UAN పై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ 12 అంకెల UAN నంబర్, ఆధార్ నంబర్, పేరు, పుట్టిన తేదీ, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. 
ఫారం నింపిన తర్వాత, చివరిలో కనిపించే డిక్లరేషన్ చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి, ఆపై మళ్ళీ Get Authorization Pin బటన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు ఒక OTP వస్తుంది, దానిని సంబంధిత గడిలో నమోదు చేసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు UAN యాక్టివేట్ అవుతుంది, మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక పాస్‌వర్డ్ వస్తుంది. 
మీరు UAN & ఆ పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి, క్యాప్చా కోడ్‌ను పూరించి లాగిన్ అవ్వండి.
కావాలనుకుంటే మీ పాస్‌వర్డ్‌ మార్చుకుని, మీకు నచ్చిన & గుర్తుంచుకోగల కొత్త పాస్‌వర్డ్‌ సెట్‌ చేసుకోవచ్చు.


మరో ఆసక్తికర కథనం: మీ పిల్లలకు దేశ ప్రధాని సంరక్షణ - ఈ స్కీమ్‌ ప్రయోజనాలు తెలిస్తే ఇప్పుడే అప్లై చేస్తారు