Youth Murder on day light in Medchal district | మేడ్చల్: జీహెచ్ఎంసీ పరిధిలో దారుణం జరిగింది. హైదరాబాద్ శివారులోని మేడ్చల్ ఏరియాలో పట్టపగలు అందరూ చూస్తుండగానే హత్య జరిగింది. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన మేడ్చల్ లో కలకలం రేపింది.
ఉమేష్ అనే 25 ఏళ్ల యువకుడ్ని ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వెంబడించారు. ఈ క్రమంలో రోడ్డు మీదనే ఉమేష్ పై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర రక్తస్త్రావంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణలు విడిచాడు. అంతా చూస్తుండగానే, విచక్షణారహితంగా ఉమేష్ ను పలుమార్లు పొడిచారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉమేష్ దారుణహత్య గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
హత్య కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్ లో పట్టపగలే జరిగిన ఉమేష్ హత్య కేసు వివరాలను మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సొంత సోదరులే ఉమేష్‌ను హత్య చేశారు. మద్యానికి బానిసైన ఉమేష్ కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేస్తున్నాడు. దాంతో అతడి సొంత తమ్ముడు రాకేష్, బాబాయ్ కొడుకు కలిసి ఈ దారుణహత్య చేశారు. ఉమేష్ మద్యం సేవించి తన తల్లిని, చెల్లిని కొట్టి హింసించేవాడు. దీంతో అతడ్ని ఎలాగైనా చంపేయాలని కుటుంబసభ్యులే ప్లాన్ చేశారు. మొదట ఇంటి వద్ద కత్తితో ఉమేష్‌ను పొడిచారు.. ఆపై పారిపోతుండగా నడిరోడ్డు వెంబడించి వెంటపడి కత్తితో పొడిచి హత్య చేశారు. మృతిచెందిన ఉమేష్‌కు నేర చరిత్ర ఉంది. అతడిపై పలు స్టేషన్లలో కేసులున్నాయి. హత్య కేసులో నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు చేపట్టాం. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు.