Breaking News Live Telugu Updates: హైదరాబాద్ కిషన్ బాగ్ లో వ్యక్తిపై కత్తితో దాడి 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 05 Jun 2022 10:09 PM
హైదరాబాద్ కిషన్ బాగ్ లో వ్యక్తిపై కత్తితో దాడి 

హైదరాబాద్ బహుదూర్పురా కిషన్ బాగ్ లో అజాజ్ అనే వ్యక్తిపై జావిద్, మరో యువకుడు కత్తితో దాడి చేశారు. డైని ల్యాండ్ హోటల్ ముందు అజాజ్ పై దాడి చేశారు. కత్తి పోట్లుకు గురైన అజాజ్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం అజాజ్, మతియు, జావిద్ మధ్య వాగ్వాదం జరిగింది.  అది మనసులో పెట్టుకొని జావిద్ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది.  పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. 

Journalist Death: సీనియర్ జర్నలిస్టు హఠాన్మరణం, సీఎం కేసీఆర్ సంతాపం

సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ కన్నుమూశారు. పరకాలలో మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ శ్రీనివాస్‌ మృతి చెందారు. మెండు శ్రీనివాస్ హఠాన్మరణంపై సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి తరపున టీఆర్ఎస్ పార్టీ సహా, సీఎంవో రిపోర్టర్‌గా శ్రీనివాస్‌ సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మెండు శ్రీనివాస్ అకాలమరణం దిగ్భ్రాంతిని కలిగించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.





బ్రాండిక్స్‌లో మళ్లీ విషవాయువు లీక్‌.. పరుగులు తీసిన సెక్యూరిటీ 

బ్రాండిక్స్‌లో మళ్లీ విషవాయువు లీక్‌.. పరుగులు తీసిన సెక్యూరిటీ 
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్‌ ఎస్‌ఈజెడ్‌లో మరోసారి విషవాయువు లీకైంది. ఘాటు వాసన రావడంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పీసీబీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. పరిస్థితి చక్కదిద్దేంత వరకు సెజ్‌ను మూసివేసి రెండు రోజులు సెలవులు ప్రకటించడంతో కార్మికులు ఎవరూ రాకపోవడంతో ఆదివారం మరో ప్రమాదం తప్పింది. మూడు రోజుల క్రితం బ్రాండిక్స్‌ సీడ్స్‌ సెజ్‌ నుంచి విషవాయువు లీక్‌ కావడంతో మూడు వందల మందికి పైగా మహిళలు అస్వస్తతకు గురయ్యారు. వీరిని సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై స్పందించి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో కాలుష్య నియంత్రణ అధికారులు నిన్నటి నుంచి సెజ్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో విషవాయువు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాని సమయంలో మరోసారి విషవాయువు లీక్‌ కావడం కలకలం రేపుతుంది.

Jubilee Hills Rape Case: బాలికపై సామూహిక అత్యాచారం కేసులో గవర్నర్ జోక్యం

జూబ్లీహిల్స్ లో బాలిక సామూహిక అత్యాచార ఘటనలో గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకున్నారు. ఆ ఘటనపై సత్వరం నివేదిక అంచాలని సీఎస్, డీజీపీని తమిళిసై ఆదేశించారు. ఆ ఘటనకు సంబంధించి తనకు పూర్తి నివేదికను 2 రోజుల్లో సమర్పించాలని నిర్దేశించారు.

Vijayawada News: విజయవాడలో సైకిల్ ర్యాలీ

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజ‌య‌వాడ‌లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సిటీ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా, మున్సిపల్ కమిషనర్ దినకర్ తదితరులు పాల్గొన్నారు. ఆధునిక ప్రపంచం అనుసరిస్తున్న విధానం వల్ల పర్యావరణానికి  నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ మనుగడను ప్ర‌శ్నార్ద‌కం చేసే కాలుష్యాన్ని అరిక‌ట్టేందుకు ప్ర‌తి ఒక్క‌రు నైతిక బాద్య‌త‌గా ప‌ని చేయాల‌ని అన్నారు.కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్ర‌ద‌ర్శించిన  సాంస్కృతిక కార్యక్రమాలు అల‌రించాయి.

Hyderabad News: పాత కారులో కుళ్లిన శవం

సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పాత కారులో బాగా పాడైపోయిన ఓ శవం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కుళ్లిపోయి ఉంది. దానని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటోన్మెంట్‌ బోర్డు పారిశుధ్య సిబ్బంది శనివారం ఉదయం లాల్‌ బజార్‌లోని శ్రీనగర్‌ కాలనీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద రోడ్డును శుభ్రం చేస్తుండగా పాత కారు లోపల నుంచి దుర్వాసన వచ్చింది. అనుమానం వచ్చి ఆ కారులో పరిశీలించగా అందులో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో కనపడింది. వెంటనే తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుపుతున్నారు.

Background

దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం వరకు సముద్రమట్టంపై 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని చోట్ల, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఉత్తర, సెంట్రల్ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలను తాకనున్నాయి. ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నా ఉక్కపోత, వేడి అధికంగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. 


ఆంధ్రప్రదేశ్, యానాంలలో..
ఈ రోజు ఎండల వేడి మరింత ఎక్కువగా ఉండనుంది. నిన్నటితో పోలిస్తే గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఉత్తర ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల మధ్యాహ్నం సమయానికి 47 డిగ్రీలను తాకనుంది. ఈ రోజు కోస్తాంధ్రలో వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. కొన్ని చోట్ల మేఘావృతమై ఉంటుందేమో కానీ, చాలా ప్రాంతాల్లో వడగాల్పులు ఎక్కువ. మరో వైపున చిత్తూరు - కర్ణాటక సరిహద్దు ప్రాంతం మీదుగా ఏర్పడుతున్న గాలుల వల్ల చిత్తూరు, అన్నమయ్య జిల్లా (మదనపల్లి) పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేఘాలు భూమిలో నుంచి వచ్చే వేడిని భయట వెళ్లనివ్వకుండా ఆపడం వల్ల ఉక్కపోత ఎక్కువౌతుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్యలు అధికం కానున్నాయి. తాగునీరు, పండ్ల రసాలు అధికంగా తీసుకోవడం వల్ల కాస్తంత ఉపసమనం ఉంటుంది.


రాజమండ్రిలో అత్యధికం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ అత్యధికంగా 46.1 డిగ్రీల వేడి నమోదయ్యింది. బెజవాడలో 45.3 డిగ్రీలు, ఏలూరులో 44.9 డిగ్రీలు, గుంటూరులో 44.8 డిగ్రీలు, అమరావతిలో 44.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 33 డిగ్రీలు, కళింగపట్నంలో 33.2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో కోస్తాంధ్ర కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. ఎండలు ఉన్నాయి కానీ కోస్తాంధ్రతో పోలిస్తే రాయలసీమలో కాస్తంత తక్కువగానే కనిపిస్తోంది. రుతుపవనాలు రాయలసీమ ను జూన్ 6 / 7 న తాకనున్నాయి. విజయవాడ, హైదరాబాద్, ఉభయ గోదావరి మీదుగా జూన్ 11 న తాకనుంది. 


కూల్ కూల్‌గా తెలంగాణ..
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. తెలంగాణలో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) నిన్నటితో పోలిస్తే నేడు బాగా తగ్గింది. గ్రాముకు నేడు రూ.35 తగ్గింది ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణం తర్వాత కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో ఈ మధ్య పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వెండి ధర నేడు కిలోకు రూ.1000 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.67,500 గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.67,500 గా ఉంది. విజయవాడలో పసిడి ధర ఇలా ఉంది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,750 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,500 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.