Breaking News Live Telugu Updates: తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద యువకుడు మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న భక్తుడు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించి ఆశ్విణి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించే లోపే భక్తుడు మృతి చెందాడు. మృతి చెందిన భక్తుడు బెంగుళూరుకు చెందిన నవీన్ కుమార్ (39)కి గా టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పర్యటన రద్దైంది. రేపు వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటించాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా అనుకూల వాతావరణ లేదని సీఎం పర్యటన రద్దైంది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ముగ్గురుకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని జిజీహెచ్‌కు తరలించారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.
రాహుల్ గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఖైరతాబాద్ జంక్షన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నిరసన కారులు ఓ స్కూటీని తగలబెట్టారు. అక్కడే ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు అద్దాలను రాళ్లు విసిరి పగలగొట్టారు. రాజ్ భవన్ వైపు దూసుకెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నం చేయగా, పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ జంక్షన్‌లో ఈ ఆందోళనలు జరగడంతో చుట్టూ పక్కల ప్రాంతాల్లో దారుణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళన చేస్తున్న రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబును అదుపులోకి తీసుకున్నారు. జగ్గారెడ్డిని తీసుకెళ్లి పోలీసు వాహనంలో బంధించారు.
- అనకాపల్లి పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చంద్రబాబు
- ‘‘చోడవరం సభను విజయవంతం చేసిన కార్యకర్తలకు అభినందనలు
- NTR స్ఫూర్తితో మనం ప్రజల పక్షాన పోరాటాలు చెయ్యాలి
- రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో పని చెయ్యాలి.
- 3 ఏళ్ల జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది
- డ్రైవింగ్ రాని వారిని సీట్లో కూర్చుని పెడితే వెనక్కి తీసుకు వెళ్తారు.
- ఇప్పుడు జగన్ పాలన కూడా అలాగే ఉంది.
- రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది.
- నిన్న సభలో మనం పోలీసుల సమస్యలపై మాట్లాడితే పెండింగ్ నిధులు విడుదల చేశారు
- ఉద్యోగులు, పోలీసులకు సమస్యలు వస్తే కూడా మాట్లాడేది టీడీపీ నే
- ఒక్క పోలీసుల నిధులే కాదు.. అందరి బకాయిలు విడుదల చెయ్యాలి
- అందరి లెక్కలు రాస్తున్నాం.. వేధింపులకు తిరిగి చెల్లిస్తాం’’
ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త అదానీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి ప్రభుత్వ సంస్థలతో ప్రతిపక్ష నేతలను కేంద్రం టార్గెట్ చేయడం సాధారణమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే, శ్రీలంక విండ్ పవర్ (పవన విద్యుత్) కాంట్రాక్టుల్లో ప్రధాని మోదీ జోక్యం ఉందని ఆ దేశ సీనియర్ అధికారులే ఆరోపిస్తున్నారని అన్నారు. మరి దీనిపై ప్రధాని మోదీ, అదానీ ఎందుకు స్పందించడం లేదని మంత్రి కేటీఆర్ నిలదీశారు.
హైదరాబాద్ పాత బస్తీలోని బహదూర్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి తాగి యువకులు వీరంగం చేశారు. షరీఫ్ అనే వ్యక్తిపై కత్తులతో దారుణంగా దాడికి పాల్పడ్డారు. గొడవ పడొద్దని అన్నందుకు షరీఫ్‌పై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తీవ్రగాయాలతో ఉన్న షరీఫ్‌ని స్థానికులు ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న గంజాయి బ్యాచ్ కోసం పోలీసుల వెతుకుతున్నారు.
Background
నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో బుధవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి ప్రతాపం నుంచి ఉపశమనం లభించింది. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాంలో మరో మూడు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
దక్షిణ కోస్తా ఒడిశా, పరిసర ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. రాగల రెండు రోజులలో ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మరాఠ్వాడా, కర్ణాటక, తమిళనాడు, విదర్భ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాల్లోకి నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
నైరుతి రుతుపవనాల రాకతో మొదలైన వర్షాలతో ప్రజలకు ఉపశమనం కలిగింది. తొలకరి జల్లుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు వాతావరణ కేంద్రం శుభవార్త అందించింది. కోస్తాంధ్ర జిల్లాల్లోకి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రకాశం జిల్లా ఉత్తర భాగాలు, గుంటూరు జిల్లా మీదుగా విస్తరిస్తోంది. మరో నాలుగు గంటల్లో విజయవాడ జిల్లాతో పాటుగా ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. అర్ధరాత్రి సమయం నుంచి విజయవాడ ఏలూరు జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
వచ్చే 3 గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు, ఈదురు గాలులు
రాగల 3 గంటల్లో మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నల్గొండ, నాగర్ కర్నూల్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణకేంద్రం ట్వీట్ చేసింది. ఈ సమయంలో ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని, ఈదురు గాలులు 30 కిలో మీటర్ల కన్నా ఎక్కువ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -