Shyam Benegal Death: భారతీయ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం. ఏడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న దిగ్దర్శకుడు శ్యామ్ బెనెగళ్ 90 సంవత్సరాల వయస్సులో కిడ్నీ సంబంధిత సమస్యలతో సోమవారం (డిసెంబర్ 23వ తేదీ) సాయంత్రం 6:30 గంటలకు మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె పియా బెనెగళ్ ధ్రువీకరించారు.
శ్యామ్ బెనెగళ్ కొద్ది రోజుల క్రితమే డిసెంబర్ 14వ తేదీన తన 90వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన కుటుంబం, బంధువులు, శ్రేయోభిలాషులతో పాటు కుల్‌భూషణ్ ఖర్బందా, నసీరుద్దీన్ షా, దివ్య దత్తా, షబానా అజ్మీ, రజిత్ కపూర్, అతుల్ తివారీ, శశి కపూర్ కుమారుడు కునాల్ కపూర్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
పద్మశ్రీ, పద్మ భూషణ్ కూడా...
శ్యామ్ బెనెగళ్ 1976లో పద్మశ్రీ అవార్డును, 1991లో పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. మంథన్, జుబేదా, సర్దారీ బేగం వంటి విజయవంతమైన సినిమాలను శ్యామ్ బెనెగళ్ తెరకెక్కించారు. ఆయనకు ఏడు సార్లు జాతీయ అవార్డు కూడా దక్కింది.
పుట్టింది భాగ్యనగరంలోనే...
1934 డిసెంబర్ 14వ తేదీన హైదరాబాద్‌లోనే శ్యామ్ బెనెగళ్ జన్మించారు. కొంకణీ భాషను మాట్లాడే చిత్రాపూర్ సర్వసత్ కుటుంబం వారిది. శ్యామ్ బెనెగళ్ తండ్రి శ్రీధర్ బి. బెనెగళ్‌ది కర్ణాటక. ఆయన ఒక ఫొటోగ్రాఫర్. శ్యామ్ బెనెగళ్‌కు సినిమాలపై ఆసక్తి కలగడానికి ఈయనే కారణం. తన తండ్రి ఇచ్చిన కెమెరాతో కేవలం 12 సంవత్సరాల వయస్సులోనే శ్యామ్ బెనెగళ్ ఒక సినిమాను తీశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనమిక్స్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. అక్కడే ఆయన హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించారు. అంకుర్, మంథన్, మండీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్‌గాటెన్ హీరో, జుబేదా, వెల్‌డన్ అబ్బా వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను ఆయన తెరకెక్కించారు. ఆయన మృతిపై పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి