Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ రోజు తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మొదటిసారి అమిత్ షా తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు బీజేపీ పార్టీ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 24 గంటల్లోనే అమిత్ షా తెలంగాణలో పర్యటించడం తెలంగాణలో ఆసక్తి రేపుతోంది. మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు బయల్దేరి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల‌ నుంచి జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసగింస్తారు. 


ఆదిలాబాద్‌లో సభ అనంతరం 5.15 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేటకు తిరుగు పయనమవుతారు. బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌ చేరుకుంటారు. సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ సిక్ విలేజ్‌లో మేధావులతో సమావేశం అవుతారు. ఆ సమావేశం తర్వాత కాకతీయ హోటల్లో బీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. రాత్రి 7.30 కు ఐటీసీ కాకతీయలో బీజేపీ క్యాడర్‌తో సమావేశం అవుతారు. తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల వ్యూహాలపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్ధేశం చేస్తారు. 


తెలంగాణలో ఎన్నికల వేడి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేయడంతో పొలిటికల్ హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ సారైనా తెలంగాణలో పాగా వేయడానికి గట్టిగా భావిస్తున్న బీజేపీ అందుకు తగ్గట్లుగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ మరో సారి అధికారం తమదేననే ధీమా వ్యక్తం చేస్తోంది. కేసీఆర్ అమలు చేసిన పథకాలు, అభివృద్ధి తమకు మరో సారి అధికారం దక్కిస్తాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి గెలిచి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తహ తహలాడుతోంది. ఇందులో భాగంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించింది.


దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు కేంద్రం ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించారు. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరుగనుంది. తెలంగాణ మొత్తం ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ నవంబర్ 3న రానుంది. నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, 2023 అని వెల్లడించారు. పరిశీలన చివరి తేదీ 13 నవంబర్, 2023. ఇక ఉపసంహరణ చివరి తేదీ 15 నవంబర్, 2023 (బుధవారం)కు గడువు ఉంటుందన్నారు. 3 డిసెంబర్, 2023న కౌంటింగ్ ఉండనుంది.  


తెలంగాణ ఎన్నికలు ముఖ్యమైన తేదీలు



  • తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే

  • పోలింగ్‌ తేదీ- 30 నవంబర్ 2023

  • కౌంటింగ్ తేదీ- 3 డిసెంబర్‌ 2023

  • తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్:  3 నవంబర్‌ 2023

  • ఎన్నికల నామినేషన్ల స్వీకరణ తేదీ-  3 నవంబర్‌ 2023

  • ఎన్నికల నామినేషన్లకు తుది గడువు -  10 నవంబర్‌ 2023

  • నామినేషన్ల స్క్రూట్నీ తేదీ-  13 నవంబర్‌ 2023

  • నామినేషన్ల  ఉపసంహరణకు ఆఖరు తేదీ-  15 నవంబర్‌ 2023