అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రపంచకప్‌ జట్టును ప్రకటించిన తర్వాత అందులో  KL రాహుల్  పేరు చూసి చాలామంది పెదవి విరిచారు. అసలే గాయంతో బాధపడుతున్న రాహుల్‌ను ఈ మెగా టోర్నీకి ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సమాధానాలకు ఆసియా కప్‌లో ఓ మోస్తరుగా సమాధానం చెప్పిన రాహుల్‌ ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో పూర్తిగా బదులిచ్చేశాడు. తాను ఎందుకు అంత విలువైన ఆటగాడినో తనను ద్వేషించేవారికి కూడా తెలిసొచ్చేలా చేశాడు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన రాహుల్‌... తన కెరీర్‌లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో తాను జట్టులో ఎందుకు ఉండాలో చెప్పేశాడు. కంగారు బౌలర్లు ప్రతీ బంతికి పరీక్ష పెడుతున్న వేళ... ఒక లోపం లేకుండా రాహుల్‌ చేసిన బ్యాటింగ్‌ విమర్శకులు కూడా ప్రశంసించేలా చేసింది. విరాట్‌ కోహ్లీ అయినా హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఒక హుక్‌ షాట్‌ అడి వికెట్‌ ఇచ్చినంత పనిచేశాడు కానీ రాహుల్‌ మాత్రం మ్యాచ్‌ మొత్తంలో ఆస్ట్రేలియా బౌలర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. సాధికారికంగా... సంపూర్ణ విశ్వాసంగా రాహుల్‌ చేసిన బ్యాటింగ్‌ ఈ ప్రపంచకప్‌లో భారత గెలుపు అవకాశాలను రెట్టింపు చేసింది.



 ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్‌లో 115 బంతులను ఎదుర్కొన్న అతడు 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గతంలోనూ  ఇలాంటి ఇన్నింగ్స్‌లో ఎన్నో ఆడిన రాహుల్‌కు.. ఈ ఇన్నింగ్స్‌ మాత్రం చాలా ప్రత్యేకం. గాయం తర్వాత కోలుకుని ఆసియాకప్‌లో పాకిస్థాన్ పై 111 పరుగులు చేసిన రాహుల్‌ ఇప్పుడు మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. చివరి వరకు క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చిన కేఎల్‌ రాహుల్‌కు ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. మరో 3 పరుగులు చేసి ఉంటే శతకం చేసే అవకాశం ఉండేది. అయితే, సెంచరీ మిస్‌ అయినందుకు బాధేం లేదని.. జట్టు విజయమే ముఖ్యమని కేఎల్ రాహుల్‌ వ్యాఖ్యానించాడు.



 కంగారులతో మ్యాచ్‌లో భారత్ ఒత్తిడిలో ఉన్న సమయంలో రాహుల్‌ తన అనుభవాన్ని ప్రదర్శించిన తీరుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.  రాహుల్ 5వ స్థానంలో సరిగ్గా సరిపోతాడని, ఎలాంటి పరిస్థితులను అయినా అతడు ఎదుర్కోగలడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ కొనియాడాడు. రాహుల్‌ స్పిన్ చాలా బాగా ఆడతాడని, స్ట్రైక్‌ రొటేట్ చేస్తాడని... కొత్త బంతిని కూడా సమర్థంగా ఎదుర్కొంటాడని వాట్సన్‌ గుర్తు చేశాడు. కీపర్‌గా ఉండడం రాహుల్‌కు అదనపు బలంగా మారిందని, బంతి ఎలా స్పందిస్తుందో అంచనా వేస్తున్నాడని విశ్లేషించాడు. 



ఐపీఎల్ 2023లో గాయం కారణంగా దూరమైన రాహుల్, కోలుకున్న అనంతరం ఆడిన 7 ఇన్సింగ్స్ ల్లోనూ స్ట్రయిక్ రేటు సగటున 100.5గా ఉంది. మొత్తం 407 పరుగులు సాధించాడు. వన్డే ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో రాహుల్ రెండింటికి సారథిగా వ్యవహరించాడు. రెండు మ్యూచుల్లోనూ జట్టును గెలిపించి సిరీస్ ను భారత్ వశం చేశాడు. ఈ సిరీస్ లో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.



భారత జట్టులో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగల సత్తా తనకుందని రాహుల్ మరోసారి నిరూపించుకున్నాడు. విరాట్ కోహ్లీతో 215 బంతులు ఎదుర్కొన్న రాహుల్‌  165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రాహుల్‌ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి బంతిని చక్కగా టైమింగ్ చేశాడు. రాహుల్ ఇన్నింగ్స్‌లో 8 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి.  ఈ ప్రపంచకప్‌ను అజేయ 97 పరుగులతో ప్రారంభించిన రాహుల్‌... ముందు మ్యాచ్‌లో మరింత రాణించి జట్టుకు ప్రపంచకప్‌ అందించాలన్న పట్టుదలతో ఉన్నాడు. భారత క్రికెట్‌ అభిమానులు ఆ క్షణాల కోసమే ఎదురుచూస్తున్నారు.