మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో ఆయనను సీఐడీ కస్టడీకి కూడా ఇవ్వలేమని పేర్కొంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రూ.300 కోట్లకుపైగా స్కామ్ జరిగిందని ఏపీ సీఐడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో చంద్రబాబును నిందితుడిగా పేర్కొన్న సీఐడీ ఆయన్ను నెల క్రితం అరెస్టు చేసింది. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
చంద్రబాబు తరపు న్యాయవాది దాఖలు చేసిన బెయిల్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ చేసిన ఏసీబీ కోర్టు.. రెండు పిటిషన్లను కొట్టివేసింది. మరోవైపు ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్లు కేసు వ్యవహారంలో బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు ఈ ఉదయమే కొట్టివేసింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కీలక వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.