Crop loan waiver in Telangana | హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రూ.2 లక్షల లోపు రైతు రుణాలన్నీ మాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 22,37,848 (22 లక్షల 37 వేల 8 వందల 48) రైతుల ఖాతాలకు రూ.17933.19 (17 వేల 9 వందల 33) కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సగం మంది రైతులకు రుణమాఫీ చేయలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న వేళ.. మంత్రి తుమ్మల రైతు రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు. అర్హులైన అన్నదాతలకు ఏదైనా కారణంతో రూ.2 లక్షలలోపు ఉన్న రుణాలు మాఫీ అవ్వకపోతే ఆందోళన చెందవద్దన్నారు. ఆ రైతుల బ్యాంకు ఖాతా, ఇతర వివరాలు సేకరించి, పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


మొదటి పంటలోపే రైతు రుణాలు మాఫీ


‘అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొదటి పంటకాలంలోపే 26,140.13 కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన రైతుబంధు బకాయిలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలతో పాటు ఆయిల్ పాం రైతులు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ బకాయిలు, కంపెనీలకు పెట్టిన బకాయిలు మేం చెల్లించాం. మాది చేతల ప్రభుత్వం, దిగజారుడు రాజకీయాలు చేయం. రాష్ట్రంలోని 35 బ్యాంకులకు సంబంధించిన 3292 బ్రాంచులు, 909 PACS ల నుంచి 12 డిసెంబర్ 2018 నుంచి 09 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న పంటరుణాల వివరాలు సేకరించాం. పాస్ బుక్ ఉన్నప్పటికీ రైతు రుణాలు పొందని ఖాతాల సంఖ్య 42 లక్షలు (ఆధార్ కార్డ్ నంబరు తప్పుగా రికార్డైన ఖాతాలు, రుణాల్లో అసలు కన్నా వడ్డీ ఎక్కువ ఉన్న బ్యాంక్ ఖాతాలు తప్ప అన్నీ వివరాలు సరిగ్గా ఉన్నవి).


మూడు దశల్లో మొత్తం రుణమాఫీ చేశాం: తుమ్మల


అధికారంలోకి వచ్చిన తరువాత రుణమాఫీ 2024 పథకం విధివిధానాలు, మార్గదర్శకాలతో మొదటి పంట కాలంలోనే ప్రభుత్వం http://G.O.Rt.No.567 ఉత్తర్వులు విడుదల చేసాం. జీవో వెలువడిన 3 రోజులకే జులై 18, 2024 నాడు, లక్షలోపు రుణాలున్న ఖాతాదారులు 11,50,193 (11 లక్షల 50 వేల నూట 93) మందికి రూ.6098.93 (6 వేల తొంబై 8) కోట్లు విడుదల చేశాం. రెండవ విడతలో లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు లోన్స్ ఉన్న 6,40,823 (6 లక్షల 40 వేల 8 వందల 23) మంది రైతులకు రూ. 6190.01 (6 వేల నూట తొంబై) కోట్లు విడుదల చేశాం.


తాజాగా ఆగస్టు 15, 2024న మూడవ విడుతలో 2 లక్షలలోపు రుణాలు 4,46,832 (4 లక్షల 46 వేల 8 వందల 32) మంది రైతుల ఖాతాలలో 5644.24 (5 వేల 6 వందల 44) కోట్ల నిధులు విడుదల చేశాం. మూడు విడతలలో కలిపి మొత్తం 22,37,848 (22 లక్షల 37 వేల 8 వందల 48) మంది రైతుల ఖాతాలకు రూ.17933.19 (17 వేల 9 వందల 33) కోట్ల నిధులు విడుదల చేశాం. హామీ మేరకు ఆగస్టు 15 లోగా 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేశాం. రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని పదేపదే చెప్పాం. కేవలం కుటుంబ నిర్ధారణకు మాత్రమే రేషన్ కార్డును పరిగణలోనికి తీసుకున్నాం. ’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు రుణమాఫీ చేయడంపై క్లారిటీ ఇచ్చారు.


Also Read: Telangana: ఏ సెంటర్‌లోనైనా చర్చకు వస్తావా- రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- రుణమాఫీపై రాజుకున్న రాజకీయం