Ali Comedy In Double Ismart Movie:  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన తాజా  చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోతోంది. భారీ అంచనాల నడుమ ఆగష్టు 15న విడుదలైన ఈ మూవీ.. తొలి షో నుంచే మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ‘లైగర్’ డిజాస్టర్ నుంచి ఈ మూవీ పూరిని బయట పడేస్తుందని అందరూ భావించినా, సాధ్యం కాలేకపోయింది. ఈ సినిమాను చూసి పూరి దర్శకత్వంలో వచ్చిన మూవీయేనా ఇది? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.


పూరి సినిమాల్లో అలీ కామెడీ


దర్శకుడు పూరి జగన్నాథ్ చిత్రాల్లో కమెడియన్ అలీ కామెడీ ట్రాక్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆయన కామెడీకి ప్రేక్షకులు పడీపడీ నవ్వుతారు. ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’, ‘పోకిరి’ ‘దేశముదురు’తో పాటు పలు సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు అలీ. తాజాగా విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’లోనూ ఆయనకు స్పెషల్ కామెడీ ట్రాక్ డిజైన్ చేశారు పూరి. బొకా అనే క్యారెక్టర్ లో కనిపించారు. అయితే, ఈ సినిమాకు ఆయన కామెడీ ట్రాక్ కు అస్సలు సింక్ కాలేదనే విమర్శలు వస్తున్నాయి.


చిరాకు పుట్టించిన అలీ కామెడీ


‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో అలీ కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు నవ్వు తెప్పించకపోగా, మరింత చిరాకు కలిగించిందనే కామెంట్స్ ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా వస్తున్న సినిమాల్లో ఇంత చెత్త కామెడీ ఎందులోనూ లేదంటున్నారు. అలీ వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు అసహనానికి గురైనట్లు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సినిమా కాస్త బాగుంది అనే లోగా అలీ వచ్చి చెడగొడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలీ ట్రాక్ లేకపోతే సినిమా కాస్త బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


‘బొకా’ క్యారెక్టర్ లేపేయకుంటే సినిమాకు బొక్కే!


ఈ సినిమా చూసిన ప్రేక్షకులలో చాలా మంది అలీ కామెడీ ట్రాక్ మినహా మిగతా సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ను మ్యాచ్ చేసేలా ఉందంటున్నారు. వీలైనంత త్వరగా అలీ కామెడీ ట్రాక్ ను తొలగించడం మంచిదంటున్నారు. అప్పుడే ఈ సినిమాకు కాస్త ప్లస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఈ విషయం మేకర్స్ దృష్టికి వెళ్లిన నేపథ్యంలో ఆయన ట్రాక్ తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


పూరి జగన్నాథ్ ఖాతాలో మరో ఫ్లాప్


బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రామ్ పోతినేనికి జోడీగా కావ్యా థాపర్ నటించింది. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించారు. మణిశర్మ సంగీతం అందించారు. మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నా.. ఈ సినిమా చివరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. పూరి ఖాతాలో మరో ఫ్లాప్ పడింది.


Read Also: మూవీ రివ్యూ నేను రాస్తానంటున్న దిల్‌ రాజు - 'రేవు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో నిర్మాత ఒపెన్ స్టేట్‌మెంట్!



Also Read: 'తంగలాన్‌'కు పార్ట్‌ 2 కూడా ఉంది - కన్‌ఫాం చేసిన హీరో విక్రమ్‌