YSRCP: విశాఖ లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామన్న ఆనందం వైసీపీకి లేకుండా పోయింది. ఆ పార్టీకి మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని షాక్ ఇచ్చారు. వార ంరోజుల క్రితం పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఆయన ఇప్పుడు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 


వైసీపీలో కీలక పదవులు చేపట్టిన ఆళ్ల నాని మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారు. వైసీపీ కూడా అధికారం కోల్పోయింది. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన వారం రోజుల క్రితం పార్టీలోని పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నట్టు జగన్‌కు లేఖ రాశారు. అయితే పార్టీలో కొనసాగుతారని అంతా భావించారు. కానీ వారం తరగక ముందే పార్టీ  ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. 


వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఆళ్లనాని. వెళ్తూ వెళ్తూ ఆయన ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. పార్టీ కార్యాలయం లీజు ముగిసిందని అందుకే ఖాళీ చేసినట్టు పేర్కొన్నారు. యజమాని అనుమతి మేరకు ఆగస్టు 15న వేడుకలు నిర్వహించిన తర్వాత ఖాళీ చేశామన్నారు. వేడుకల తర్వాత పార్టీ కార్యాలయం కోసం వేసిన షెడ్‌లను కూడా కూల్చేశారు.