Adilabad: ఐటీ, జీ.ఎస్.టీ అధికారి పేరుతో ఆదిలాబాద్ జిల్లాలో భారీ మోసానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీని గురించి మావల పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్పీ ఉదయ్ కుమార్ వివరాలు తెలియజేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలానికి చెందిన శివకరణ్ కాగ్నే అనే యువకుడు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మోసానికి పాల్పడినట్లు ఎస్పీ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ప్రముఖ బట్టల వ్యాపారి మొబైల్ నంబర్ ను తెలుసుకుని ఆయనకు జీఎస్టీ, ఐటీ అధికారి పేరుతో బెదిరింపులకు గురి చేశాడని వెల్లడించారు. బాధితుడిని ఓ లాడ్జ్ కు తీసుకెళ్ళి కాళ్ళు, చేతులు కట్టేసి సుత్తితో తలపై కొట్టి మానసికంగా, శారీరకంగా హింసించాడని పేర్కొన్నారు. రూ. 5 లక్షలు ఇవ్వాలని ఆ వ్యాపారిని బెదిరించాడు. బాధితుడు వెంటనే డబ్బులు సర్దుబాటు చేయటంతో వాటిని తీసుకుని పరారయ్యాడని ఎస్పీ తెలిపారు.
బాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపామని ఎస్పీ వివరించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడి ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశామన్నారు. విచారణలో నేరం చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని చెప్పారు. నిందితుడి వద్ద రూ. 60 వేల విలువైన సెల్ ఫోన్, రూ. 3 లక్షల 35 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేరానికి ఉపయోగించిన తాడు, సుత్తి, కత్తి, సిమ్ కార్డ్ లను జప్తు చేసినట్లు వివరించారు.
ఆదిలాబాద్ వాసులను హడలెత్తిస్తున్న పులులు, భీంపూర్ లో ఆవుపై దాడి!
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ శివారులో ఇటీవల రెండు పులులు జనాల కంట పడిన ఘటన మరవక ముందే భీంపూర్ మండలం తాంసి -కె శివారులో ఆదివారం అర్ధరాత్రి 4 పులుల సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. పిప్పల్కోటి రిజర్వాయర్ పనుల ప్రదేశంలో పులులు టిప్పర్ వాహన డ్రైవర్ కంట పడ్డాయి. డ్రైవర్ తీసిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి. పంట చేతికి వచ్చిన సమయంలో పులుల సంచారం తమకు నష్టం చేస్తోందని స్థానికులు వాపోతున్నారు.
భీంపూర్ లో ఆవుపై దాడి
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పులి దాడి కలకలం రేపుతుంది. భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామ శివారులో ఆవుపై పులులు దాడి చేసి హతమార్చాయి. ఆవు వెనుక భాగం పూర్తిగా తినేశాయి. కొద్ది రోజులుగా భీంపూర్ మండలంలోని పిప్పలకోటి, తాంసి కె, గొల్లఘాట్ తాంసి శివారులో పులులు సంచరిస్తున్నాయి. ఆదివారం రాత్రి తాంసి కె సమీపంలో టిప్పర్ డ్రైవర్ కి నాలుగు పులులు రోడ్లపై కనిపించాయి. అతడు సెల్ ఫోన్ లో పులుల వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. గ్రామస్థులు అటవీ ప్రాంతాల్లోకి, పొలాల్లోకి వెళ్లకూడదని అటవీ అధికారులు సూచిస్తున్నారు. తాజాగా భీంపూర్ మండలంలోని గుంజాల గ్రామ శివారులో ఓ ఆవును పులులు హతమార్చి సగభాగం పూర్తిగా తినేయడంతో పత్తి చేలలలో పంట కోసేందుకు వెలుతున్న కూలీలు భయాందోళనకు గురవుతున్నారు.