Warangal News:  ఆ తండ్రి విదేశాల నుంచి చాక్లెట్లు తీసుకొచ్చారు. ఎంతో ఆనందంగా తన పిల్లలకు వాటిని ఇచ్చాడు. అయితే అదే చాక్లెట్ తన ముద్దుల కుమారుడిని బలితీసుకుంటుందని ఊహించలేకపోయాడు. చాక్లెట్ గొంతులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఘటన వరంగల్ లో జరిగింది. 


చాక్లెట్ గొంతులో ఇరుక్కుని


ఓ తండ్రి విదేశీ పర్యటనకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చిన చాక్లెట్‌ అతని కుమారుడి ప్రాణం తీసింది. చాక్లెట్‌ గొంతులో ఇరుక్కొని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్‌ నగరంలో జరిగింది. రాజస్థాన్‌కు చెందిన కంగర్‌సింగ్‌ బతుకుతెరువు కోసం వరంగల్‌ వచ్చి డాల్ఫిన్‌ గల్లీలో స్థిరపడ్డారు. ఎలక్ట్రికల్‌ దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనకు భార్య గీత, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. 


స్థానిక శారద పబ్లిక్‌ స్కూల్‌లో వారి చిన్నారులు చదువుతున్నారు. ఇటీవల కంగర్‌సింగ్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి తిరిగొచ్చారు. శనివారం పిల్లలు స్కూల్‌కు వెళ్లే క్రమంలో విదేశాల నుంచి తండ్రి తీసుకొచ్చిన చాక్లెట్‌ను వారికి ఇచ్చారు. వీరిలో రెండో తరగతి చదువుతున్న కుమారుడు సందీప్‌ (8) స్కూల్‌కు వెళ్లి చాక్లెట్‌ను నోట్లో వేసుకున్నాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. గమనించిన పాఠశాల సిబ్బంది బాలుడి తండ్రికి సమాచారం అందించారు. చికిత్స కోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.  గొంతులో చాక్లెట్‌ను గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తుండగానే సందీప్‌ మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 



యూట్యూబ్ సాయంతో నకిలీ నోట్ల ప్రింటింగ్, ముఠా గుట్టురట్టు చేసిన వరంగల్ పోలీసులు


వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ సాయంతో నకిలీ నోట్లను ముద్రించి వివిధ ప్రాంతాల్లో చెలామణి చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టి అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రెండు వేల రూపాయల నోట్లు మూడు వందలు (ఆరు లక్షలు), కలర్ ప్రింటర్, ఏడు మొబైల్స్, రెండు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ నోట్ల తయారీ అవసరమైన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో  సయ్యద్ యాకుబ్ ఆలియాస్ షకీల్ (ప్రధాన నిందితుడు), యం.డి సమీర్(30), పేరాల అవినాష్ (28), కత్తి రమేష్ (24), యం.డి అక్రం ఆలీ (27), గడ్డం ప్రవీణ్ (33), గుండ్ల రజనీ (33), కత్తి సునిత (23), సోహెల్ (22) నిందితులని పోలీసులు తెలిపారు.  


జైలులో దొంగ ముఠాతో పరిచయం 


వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. పోలీసుల అరెస్ట్ చేసిన సయ్యద్ యాకుబ్ అలియాస్ షకీల్, గడ్డం ప్రవీణ్, గుండా రజనీ గతంలో కిడ్నాప్ కేసులో రామగుండం సబ్ జైలులో శిక్ష అనుభవించే సమయంలో వీరికి దొంగ నోట్లు ముద్రించే ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. వారి ద్వారా దొంగ నోట్ల ముద్రించి తీరును తెలుసుకున్న నిందితులు జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. దీంతో నిందితులు నేర చరిత్ర కలిగిన నిందితులతో కలిసి నోట్ల తయారీకి శ్రీకారం చుట్టారు.  యూట్యూబ్ ద్వారా ఓరిజినల్ రెండు వేల రూపాయలు పోలిఉండే కాగితాల గురించి తెలుసుకున్న ఈ ముఠా వాటిని కొనుగోలు చేసి నకిలీ నోట్లను ముద్రించింది.  


రద్దీ ఉండే ప్రాంతాల్లో నోట్ల చెలామణి


నిందితులు ముద్రించిన నకిలీ నోట్లను రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతాలతో పాటు కిరాణం, బట్టలషాపు, మద్యం బెల్ట్ షాపుల వద్ద నకిలీ నోట్లను చెలామణి చేసేవారు. గత సంవత్సర కాలంగా నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో  నకిలీ నోట్లను చెలామణి చేశారు. వచ్చిన డబ్బుతో నిందితులు మద్యం సేవిస్తూ, జల్సాలు చేసేవారు. శుక్రవారం ఉదయం ప్రధాన నిందితుడు మరో నిందితుడు అవినాష్ తో దొంగనోట్లను చెలామణి చేసేందుకు ద్విచక్ర వాహనంపై సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమల్ బార్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో పథకం ప్రకారం నిందితులను పట్టుకున్నారు.  నిందితులను అరెస్ట్ చేసి వారిని విచారించగా మిగతా నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకోసుకున్నారు.