Suvendu Adhikari on CAA:


ఠాకూర్‌నగర్‌లో ఛాలెంజ్..


పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి CAAపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే అమిత్‌ షా "CAAని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తాం" అని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా...సువేందు అధికారి మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. "మీకు చేతనైతే CAAని అడ్డుకుని చూడండి" అని ఛాలెంజ్ చేశారు. ఠాకూర్‌నగర్‌లో ఓ సమావేశానికి హాజరైన సందర్భంగా...ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. 
"చట్టపరంగా అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లు ఉన్న వారిని జాబితా నుంచి తొలగిస్తామని ఎప్పుడూ చెప్పలేదే" అని అన్నారు. ఠాకూర్‌ నగర్‌లో బంగ్లాదేశ్‌ మూలాలున్న మటువా వర్గ ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి కీలకమైన ప్రాంతంలో సువేందు అధికారి అలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. "మేం ఎన్నో సార్లు CAA గురించి మాట్లాడాం. బెంగాల్‌లోనూ తప్పకుండా ఇది అమలవుతుంది. మీకు  (మమతా బెనర్జీ) ధైర్యం ఉంటే అడ్డుకోండి" అని అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ సర్కార్ ఆర్టికల్ 370 ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక ఆ హామీని నెరవేర్చిందని గుర్తు చేశారు. ఇదే తరహాలో CAAని అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఎవరి హక్కుల్ని హరించాలనేది బీజేపీ ఉద్దేశం కాదని...వెల్లడించారు. కొందరు కావాలనే తప్పు దోవ పట్టిస్తున్నారని పరోక్షంగా మమతా బెనర్జీని విమర్శించారు. 
 
దీదీ వర్సెస్ షా 


గుజరాత్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బీజేపీ Citizenship Amendment Act (CAA),National Register of Citizens (NRC) అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చిందని ఇటీవల ఓ సభలో మమతా  బెనర్జీ మండి పడ్డారు. "మాది మానవత్వంతో వ్యవహరించే ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న రాక్షస ప్రభుత్వంతో మనం పోరాటం చేయాలి" అని వెల్లడించారు. "నేను బతికున్నంత వరకూ రాష్ట్రంలో CAA అమలుని అంగీకరించను. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన పౌరులు బెంగాల్ పౌరుల కన్నా తక్కువేమీ కాదు. మీ మద్దతు లేకుండా మోదీ ప్రధాని అయ్యేవారా..? అంతెందుకు నేనైనా సీఎంని అయ్యుండాదాన్నా" అని అన్నారు. "సీఏఏను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టామని అనుకుంటే అది ముమ్మాటికీ తప్పే. ఈ విషయంలో ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేయాలనుకోవడం లేదు" అని అమిత్‌షా తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు. "సీఏఏ అనేది ఈ దేశంలో అమలు చేసి తీరాల్సిన చట్టం. అది ఎప్పటికైనా కార్యరూపం దాల్చుతుంది.  ఇది ఎప్పటికీ అమలు కాదని కొందరు కలలు కంటున్నారు" అని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలుకు ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించగా.."ఇందుకు సంబంధించి కొన్ని రూల్స్‌ని తయారు చేయాల్సి ఉంది. కరోనా కారణంగా అమలు చేయడం కుదరలేదు. ఇప్పుడు కరోనా నుంచి మనమంతా బయటపడ్డాం. ఇప్పుడు మళ్లీ పని మొదలు పెడతాం" అని తెలిపారు. ఇప్పుడే కాదు. అమిత్‌షా గతంలోనూ చాలా సందర్భాల్లో CAA గురించి ప్రస్తావించారు. 


Also Read: WhatsApp Data Breach: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్ - 50 కోట్ల మంది డేటా లీక్!