ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారుల వాట్సాప్ వివరాలు ఆన్‌లైన్‌లో లీకైనట్లు తెలుస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా లీక్‌ల్లో ఒకటి కావచ్చు అని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైబర్‌న్యూస్ నివేదిక ప్రకారం ఒక హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో 487 మిలియన్ల వాట్సాప్ యూజర్ మొబైల్ నంబర్‌ల 2022 డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్లు పేర్కొంటూ ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. డేటాబేస్‌లో యూఎస్ఏ, యూకే, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా, భారతదేశంతో సహా 84 వేర్వేరు దేశాల WhatsApp వినియోగదారుల మొబైల్ నంబర్లు ఉన్నాయి.


ఈ సమాచారం ఎక్కువగా ఫిషింగ్ దాడులు చేసేవారికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాట్సాప్ వినియోగదారులు తెలియని నంబర్ల నుండి కాల్స్, మెసేజ్‌లకు దూరంగా ఉండటం మంచిది. డేటా సెట్‌లో 32 మిలియన్ల US యూజర్ రికార్డ్‌లు ఉన్నాయని పోస్ట్‌లో పేర్కొన్నారు. అలాగే ఈ లీక్ బారిన పడ్డ యూజర్లు ఈజిప్ట్‌లో 45 మిలియన్లు, ఇటలీలో 35 మిలియన్లు, సౌదీ అరేబియాలో 29 మిలియన్లు, ఫ్రాన్స్‌లో 20 మిలియన్లు, టర్కీలో 20 మిలియన్లు ఉన్నారు. డేటాబేస్‌లో దాదాపు 10 మిలియన్ల రష్యన్లు, 11 మిలియన్లకు పైగా యూకే పౌరుల ఫోన్ నంబర్లు ఉన్నాయి.


వీటిలో US డేటాసెట్‌ను 7,000 డాలర్లకు (సుమారు రూ.5,71,690)కి విక్రయిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. UK, జర్మనీ డేటాసెట్‌ల ధర వరుసగా 2,500 డాలర్లు (సుమారు రూ.2,04,175), 2,000 డాలర్లుగా (సుమారుగా రూ.1,63,340) ఉంది.


మెటా, దాని ప్లాట్‌ఫారమ్‌ల్లో డేటా లీక్ అవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం ఒక లీక్‌స్టర్ 500 మిలియన్లకు పైగా ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉచితంగా అందించారు. లీకైన డేటాలో ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు ఉన్నాయి.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?