Adivasi Aharam: ఆదివాసీల పౌష్టికాహారం ఇప్పపువ్వు. ఇప్పపువ్వు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇప్పపూలతో ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తారు. మారుమూల ప్రాంతాల్లో ఇప్పపూలతో సారాను సైతం తయారు చేస్తుంటారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల్లో నెలకొన్న రక్త హీనత సమస్యను సైతం ఇప్పపువ్వు లడ్డుతో దూరం చేసేందుకు ఆదివాసీ మహిళలు ఇప్ప పువ్వు లడ్డూ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఇప్ప పువ్వు లడ్డూలను అంగన్వాడి కేంద్రాలకు, ఇతరులకు విక్రయిస్తూ స్వయం ఉపాధిని పొందుతున్నారు. ఆదివాసీల్లో నెలకొన్న రక్త హీనతను దూరం చేస్తూ, ఇప్పపువ్వు లడ్డూల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ అందరికీ ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ ఆదివాసీ మహిళలు. ఈ ఆదివాసీ మహిళల స్వయం కృషి సేవలని అభినందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పలు సంస్థలు అవార్డులను సైతం అందించారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇప్పపువ్వు లడ్డు కేంద్రాన్ని నడిపిస్తు ఆదర్శంగా నిలుస్తున్న ఆదివాసీ మహిళలపై ఏబీపీ దేశం ప్రత్యేక కథనం.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని ఎక్స్ రోడ్ లో ఆదివాసి ఆహారం పేరిట ఆదివాసీ మహిళలు ఇప్పపువ్వు లడ్డు తయారీ కేంద్రాన్ని నడిపిస్తున్నారు. భీం బాయి ఆదివాసీ మహిళ సహకార సంఘం అధ్వర్యంలో ఈ లడ్డూ కేంద్రాన్ని 12 మంది ఆదివాసి మహిళలు కలిసి నడిపిస్తున్నారు. టీం లీడర్ గా కుమ్ర భాగుబాయి దీన్ని ముందుకూ తీసుకెళ్తున్నారు. గత ఐదేళ్ల కిందట అప్పటి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఈ లడ్డూ కేంద్రానికీ సహకారం అందించారు. దీంతో ఆదివాసీ మహిళలలు స్వయం ఉపాధినీ పొందుతూ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసి మహిళలలు నెలకొంటున్న రక్త హీనత సమస్యను సైతం దూరం చేస్తున్నారు. ఇప్ప పువ్వు ఈ వేసవిలో వస్తుంది. వేసవిలో లభించే ఈ ఇప్పపువ్వులను ఆదివాసి మహిళలు వేకువజామున వెదురుబుట్టలలో సేకరించి ఇంటికి తీసుకొచ్చి ఎండలో ఆరబెట్టి ఈ ఇప్ప పూలతో రక రకాల వంటకాలు తయారు చేసుకొని తింటారు.
ఈ ఇప్ప పువ్వులను లడ్డు కేంద్రానికి సైతం విక్రయిస్తూ ఆదివాసీ మహిళలు ఉపాధిని సైతం పొందుతున్నారు. లడ్డు కేంద్రానికి తీసుకువచ్చిన ఈ ఇప్ప పువ్వులను ఆరబెట్టి ముందుగా నూనెలో వేయించి తీసి గ్రాండర్ లో మెత్తగా పొడి చేస్తారు. అనంతరం ఈ ఇప్పపువ్వు చూర్ణాన్ని, కొంత వేరుశనగ పల్లిలు, యాలకులు, బాదం, కాజులను కలిపి చూర్ణం చేసి బెళ్ళం పానకంలో కలిపి లడ్డులను తయారు చేస్తున్నారు. అనంతరం ఈ లడ్డులను ఆర్డర్లు ఉన్న చోట బాక్సులలో పెట్టి విక్రయిస్తున్నారు. రూ.400 కీలో లడ్డు విక్రిస్తున్నారు. ఈ లడ్డు తినడానికి ఎంతో కమ్మగా రుచికరంగా ఉంటుంది. ఈ రుచికరమైన ఇప్ప పువ్వు లడ్డులను తింటే మంచి బలం వస్తుంది ఆరోగ్యానికి ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా మహిళలకు ఉన్న రక్త హీనత సమస్య బాగుపడుతుంది. ఈ లడ్డూ తింటే రక్తం వృద్ది చెందుతుంది. 12 మంది మహిళా సభ్యులు కలిసి ఈ లడ్డు కేంద్రాన్ని నడిపిస్తున్నారు. భీం భాయి ఆదివాసి మహిళా సహకార సంఘం అధ్యక్షురాలు కుమ్ర భాగుబాయి ఈ లడ్డు కేంద్రాన్ని ముందుండి నడిపిస్తున్నారు. లడ్డు కేంద్రాన్ని నడిపిస్తూ ఈ ఆదివాసీ మహిళలు స్వయం ఉపాధిని పొందుతున్నారు.
ఉట్నూర్ కు చెందిన ఈ ఆదివాసీ మహిళలు ఇప్ప పువ్వు లడ్డు కేంద్రాన్ని నడిపిస్తు, స్వయం ఉపాధిని పొందుతు, ఆదివాసి మహిళలలో నెలకొన్న రక్త హీనత సమస్యని దూరం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివాసీ మహిళల స్వయం కృషిని అభినందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థలు అవార్డులను సైతం అందించారు. 2023లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆది మహోత్సవ్ నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ కార్యక్రమంలో.. స్కిల్ డెవలప్మెంట్ .. ఇక్రిశాట్ మరియు జిల్లా కలెక్టర్ ఐటిడిఎ పిఓ లు అవార్డులను అందజేశారు. ఇలాగే ఈ లడ్డు కేంద్రం మరింత ముందుకు సాగాలని ఆదివాసి మహిళలు అందరికీ ఆదర్శంగా నిలవాలని అభినందించారు.
ఇప్పపువ్వు లడ్డు కేంద్రంలో ప్రస్తుతం ఆర్డర్ల క్రమంలోనే లడ్డూల విక్రయం కొనసాగుతుందని ఇప్పటివరకు అంగన్వాడి కేంద్రాలకు రక్తహీనత సమస్యలపై పలువురు లడ్డులను తీసుకెళ్లడం జరుగుతుందని, ప్రభుత్వం మరింతగా ఈ లడ్డు కేంద్రాలను వ్యాపింపజేసేలా రక్తహీనత సమస్యను దూరం చేసే దిశగా ఆశ్రమ పాఠశాలలోనూ, గురుకుల పాఠశాలలోను ఈ ఇప్ప పువ్వు లడ్డులను పంపిణీ చేసే దిశగా కృషి చేయాలని, దీంతో ఆదివాసి మహిళలకూ మరింతగా ఉపాధి పెరగడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని సైతం కాపాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనీ విద్యార్థినిలు, మహిళలలో నెలకొన్న రక్తహీనత సమస్యను దూరం చేయవచ్చని ఆదివాసీ మహిళలు కోరుతున్నారు.