Adilabad Gond Fort: ఆదిలాబాద్ జిల్లాలోని గోండుల వైభవానికి చిహ్నంగా నిలిచిన గోండు రాజుల కోట నేడు శిథిల దశకు చేరుకుంది. ఈ కోటను 18వ దశాబ్దంలో ఉట్నూర్‌లో గోండు జాతికి చెందిన సీతాగొంది ఆత్రం హన్మంత రాయుడు తన అనుచరులతో నిర్మించి మంత్రులు, సేనాధిపతులతో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పాలన సాగించాడని చరిత్ర చెబుతోంది. అడవులే జీవనాధారంగా మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గోండు జాతి గతంలో కోటలు నిర్మించుకుని రాజ్యపాలన సాగించారనడానికి ఈ కోట సజీవ సాక్ష్యం.


ఉట్నూర్‌లో ఉన్న గోండు రాజుల కోటను కేంద్రంగా పెట్టుకొని హన్మంతరాయుడు నైజాంతో సత్సంబంధాలు ఏర్పరుచుకొని రాజ్య పాలన కొనసాగించాడు. అప్పట్లో అరాచకాలను సృష్టిస్తున్న బందిపోట్ల బారి నుంచి గోండులను రక్షించి హన్మంతనాయుడు వారి ఆదరణను చూరగొన్నాడు. అయితే ఆయన మరణానంతరం ఆయన భార్య పరిపాలన సాగించగా, ఆ సమయంలో గోండులకు నైజాం ప్రభుత్వంతో సంబంధాలు బెడిసికొట్టాయి. దాంతో నైజాం ప్రభుత్వం గోండుల కోటపై దాడి చేసింది. ఓటమి చవిచూసిన గోండు జాతి అడువుల్లోకి పారిపోయి తలదాచుకుందని చరిత్ర చెబుతోంది. 




నాగరికులపై నమ్మకం కోల్పోయిన గోండులు..


అప్పటి నుంచి ఆ జాతికి నాగరికులపై నమ్మకం పోయింది. నమ్ముకున్న వారికి ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉండే లక్షణం గోండు జాతిలో ఇప్పటికి ఉంది. హన్మంతరాయుడు తమ్ముడు జగపత్ షా ఉట్నూర్‌లోని లక్కారం గ్రామంలో స్థిర నివాసం ఏర్పర్చుకొని గోండుల సంక్షేమం కోసం శ్రమించాడు. హన్మంతరాయుని మనుమడు సీతాగోంది ఆత్రం దేవ్‌షా (రాజదేవ్‌షా) కుటుంబం ప్రస్తుతం లక్కారంలో నివసిస్తున్నారు. రాజదేవ్‌షా గతంలో ఉట్నూర్‌ సమితి అధ్యక్షునిగా, శాసన సభ్యునిగా పనిచేశారు. ఈయన దివంగతులయ్యారు. ఏజెన్సీలో తొలిసారి ఎమ్మెల్యే గా 1969లో గెలిచి పదేళ్ల పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పని చేశారు. ఏజెన్సీలోని ఆదివాసీ గిరిజనులకు ఎనలేని సేవలు చేశారు. 2005లో అనారోగ్యంతో దేవుషా మృతి చెందారు. వీరికి నలుగురు కుమారులు, ఏడుగురు కూతుర్లు ఉన్నారు. కొన్ని నెలల క్రితం దివంగత రాజ దేవుషా సతీమణి ఆత్రం లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. 


దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు..


అనాదిగా పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఏటా కోటలో దసరా సందర్భంగా కుటుంబీకులు పూజలు చేస్తున్నారు. డోలు, వాయిద్యాలతో లక్కారంలోని వారి నివాసం నుంచి రహదారి గుండా కోట వరకు పాదరక్షలు లేకుండా  కాలి నడకన వెళ్ళి కోటలో పూర్వీకులు గోండురాజుల సమాధుల వద్ద దసరా నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తున్నారు. అనంతరం కోటపై గోండు రాజుల చిహ్నంగా ప్రతీక జెండా ఎగుర వేస్తున్నారు. తదితనంతరం అందరు కుటుంబీకులు కలుసుకొని తమ తాత ముత్తాతల సమాధుల వద్ద దసరా సందర్భంగా అక్కడ సైతం జెండాను ఎగురవేస్తు చివరిసారిగా అందరు ఒకేసారి మొక్కులు చెల్లించి తిరిగి వారి నివాసానికి చేరుకొని అక్కడ సైతం ఉన్న తమ పెద్దల సమాధుల వద్ద జెండా ఎగురవేసి దసరా పూజలు చేస్తున్నారు. ఇలా ప్రతియేటా దసరా సందర్భంగా కోటపై గోండుల చిహ్నంగా ప్రతీక జెండా ఎగురవేసి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.




అక్రమ తవ్వకాలతో శిథిలావస్తకు చేరుకున్న కోట


ఈ గోండు రాజుల కోటలో గుప్త నిధుల కోసం కొందరు అక్రమ తవ్వకాలు చేస్తుండడం వల్ల కోట నానాటికి శిథిలం అవుతోంది. నాగరికత ప్రపంచం నుంచి వెలివేసినట్టుగా ఉన్న గోండుల కోట గురించి ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని గత వైభవానికి చిహ్నంగా ఉన్న కోటను రక్షించాలని, దశాబ్దాల క్రితం గోండు రాజులు నిర్మించిన కోటలో పర్యాటక కేంద్రం ఏర్పాటు చేయాలని గోండు రాజుల కుటుంబీకులు ఆదివాసీ నాయకులు కోరుతున్నారు. ఈ కోటను ఐటీడీఏ అధికారులు పర్యాటక కేంద్రంగా మార్చి గోండుల సంప్రదాయ మ్యూజియం ఏర్పాటు చేయాలంటున్నారు. గోండుల చరిత్ర సజీవంగా నిలిచిపోతుందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత 2015 - 2016 లో రాష్ట్ర గిరిజన శాఖ కమిషనర్‌ క్రిష్టినా ఝడ్ చొంగ్తూ తోపాటు ఇక్కడి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్వీ కర్ణన్ కోటను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. 


కోటలో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన నిధులు కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఆపై కోటలో ఉన్న ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు తొలగించి కోటను శుభ్రంగా మార్చారు. మళ్ళీ అప్పటి నుంచి కోటవైపు ఎవరు తిరిగి చూడలేదు. ప్రస్తుతం మళ్ళీ యథావిదిగా కోటలో పిచ్చి మొక్కలు పెరిగాయి. కోటలో ఏటా దసరా రోజు గోండు రాజుల వంశీయుల పూజల కోసం వారే స్వయంగా కోటను శుభ్రంగా మార్చుకుంటారు. వారు తప్ప మరెవరు శభ్రం చేయరు. ఇలా ప్రతియేటా పూజల కోసం తామే పిచ్చి మొక్కలు తొలగించి కోటను శుభ్రపరుచుకోవడం జరుగుతుందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కోటలో పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా మార్చాలని కోరుతున్నారు. పర్యాటకులకు తమ గోండుల పాలనకు సజీవ సాక్ష్యంగా ఈ కోటను సంరక్షించాలని వేడుకొంటున్నారు.