IND vs SA 1st ODI: క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు మరో సిరీస్ రెడీ! భారత్, దక్షిణాఫ్రికా నేటి నుంచి వన్డే సిరీసులో తలపడనున్నాయి. ప్రధాన జట్టు ఆసీస్‌కు బయల్దేరడంతో టీమ్‌ఇండియాకు కుర్రాళ్లే నేతృత్వం వహిస్తున్నారు. టీ20 సిరీస్ చేజార్చుకున్న సఫారీలు వన్డే వరల్డ్‌కప్ సూపర్ లీగ్ పాయింట్ల కోసం పోరాడనుంది. మరి లక్నో ఏకనా స్టేడియంలో గెలిచేదెవరు? తుది జట్లలో ఎవరుంటారు? పిచ్ పరిస్థితి ఏంటి?
సంజూపై చూపు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం హిట్‌మ్యాన్ సేన ఇప్పటికే ఆసీస్ బయల్దేరింది. దాంతో శిఖర్ ధావన్ టీమ్‌ఇండియాను నడిపించనున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అతడు సెంచరీ చేయలేదు. ఈ సారి కరవు తీర్చుకుంటాడేమో చూడాలి. జింబాబ్వే, వెస్టిండీస్‌పై రాణించిన శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్‌లో ఆకట్టుకుంటున్నాడు. రాహుల్ త్రిపాఠి, రజత్ పాటిదార్ మధ్య ఒక ప్లేస్ కోసం పోటీ నెలకొంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ గురించి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా గాయపడటంతో దీపక్ చాహర్ పై అందరి చూపూ నెలకొంది. ఒకవేళ అతడు రాణిస్తే ప్రపంచకప్ ఆడొచ్చు. కుల్‌దీప్, రవి బిష్ణోయ్ స్పిన్, సిరాజ్, శార్దూల్ పేస్ బాధ్యతలు తీసుకుంటారు.
ప్రపంచకప్ కోసం
టీ20 ఫార్మాట్లో రాణిస్తున్నప్పటికీ వన్డేల్లో దక్షిణాఫ్రికా వెనకబడే ఉంది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్ ఆడాలంటే ఈ సిరీసులో గెలవడం అత్యంత ముఖ్యం. అందుకే ప్రధాన ఆటగాళ్లనే ఆడించనుంది. తెంబా బవుమా ఫామ్ లేమి ఆ జట్టును వేధిస్తోంది. మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ మిడిలార్డర్‌లో కీలకం అవుతారు. క్వింటన్ డికాక్, జానెమన్ మలన్ ఓపెనింగ్ చూసుకుంటారు. ప్రపంచకప్ రిజర్వుగా ఎంపికైన అండిలె ఫెలుక్‌వాయో, మార్కో జన్‌సెన్ బౌలింగ్‌పై ఆసక్తి నెలకొంది. ఆల్‌రౌండర్ ప్లేస్ కోసం వీరు పోటీ పడుతున్నారు.
భారత్, దక్షిణాఫ్రికా (అంచనా) జట్లు
టీమ్ఇండియా: శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి/రజత్ పాటిదార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్‌దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జానెమన్ మలన్, తెంబా బవుమా, అయిడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, అండిలె ఫెలుక్‌వాయో / డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నార్జ్/మార్కో జన్‌సెన్, లుంగి ఎంగిడి, కాగిసో రబాడా
వర్షం అంతరాయం?
లక్నో ఏకనా స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా ఎప్పుడూ ఆడలేదు. 2019లో ఎక్కువగా అఫ్గాన్, వెస్టిండీసే ఇక్కడ ఆడాయి. సగటు తొలి ఇన్నింగ్స్ స్కోర్ 230గా ఉంది. వేగంగా పరుగులు చేసేందుకు అనుకూలంగా ఉండదు. అయితే టీ20ల్లో టీమ్‌ఇండియా రెండుసార్లు 195, 199 స్కోర్లు చేయడం గమనార్హం. ప్రస్తుతానికి లక్నోలో ఆకాశం మేఘావృతమైంది. వర్షంతో మ్యాచ్‌కు పదేపదే అంతరాయం కలగొచ్చు.