Person Died In Fish Prasadam Distribution Queue: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో (Nampally Exhibition Ground) చేప ప్రసాదం పంపిణీలో శనివారం విషాదం జరిగింది. చేప మందు కోసం క్యూలైన్‌లో నిలబడ్డ వ్యక్తి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు అతన్ని గమనించి సపర్యలు చేసినా అతనిలో చలనం లేకపోవడంతో అక్కడే ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వారు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి.. సీపీఆర్ చేశారు. అంబులెన్స్ వచ్చిన తర్వాత అతన్ని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతి పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు, క్యూ లైన్‌లో వ్యక్తి మృతితో అధికారులు అప్రమత్తమయ్యారు. క్యూలైన్‌లో ఎవరికైనా బాగోలేదనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని.. నిలబడిన చోటే సేద తీరాలని సూచిస్తున్నారు. 


భారీగా తరలివచ్చిన ప్రజలు


అటు, ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో శనివారం, ఆదివారం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో జనం తరలివచ్చారు. క్యూలైన్లలో నిలబడ్డ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రతీ ఏడాది మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా బత్తిని సోదరులు.. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధిత బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. బత్తిని కుటుంబం(Bathini Family) కొన్ని దశాబ్దాలుగా ఈ చేపమందు ఉచితంగా అందజేస్తోంది. బత్తిన శంకర్‌గౌడ్ వాళ్ల తాతకు ఓ సాధువు ఈ మందు తయారీ విధానం నేర్పించి ఉచితంగా అందజేస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పడంతో అప్పటి నుంచి ఈ చేపప్రసాదం అందిస్తున్నారు. ఇటీవలే హరినాథ్‌గౌడ్ మరణించినా... ఆయన కుటుంబ సభ్యులు ఈ ఏడాది చేపమందు పంపిణీ చేయనున్నారు. అయితే, ప్రసాదం ఉచితంగా అందిస్తున్నా.. చేపలను మాత్రం ఎవరికి వారే సొంతంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మైదానం ఆవరణలోనే ప్రత్యేక స్టాళ్లు పెట్టి కొర్రమీను చేప పిల్లలను విక్రయిస్తుంటారు. 


ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


మరోవైపు, చేప మందు కోసం వచ్చే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వివిధ రూట్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్ స్టేషన్లు, విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకూ ఈ సర్వీసులు తిరగనున్నట్లు అధికారులు తెలిపారు. చేప మందు కోసం వచ్చే వారు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.