అతి పెద్ద వీడియో వేదిక YouTube తన ఆదాయాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు అణ్వేషిస్తోంది. YouTube ప్రీమియం సబ్‌ స్క్రిప్షన్ ద్వారా భారీగానే డబ్బును సంపాదిస్తోంది. యూట్యూబ్ వీడియోలు చూసే సమయంలో  వచ్చే యాడ్స్ ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతోంది. అయినా, ఇంకా డబ్బును పోగు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నది. తాజాగా యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తోంది.


ఇకపై యూట్యూబ్‌ లో 4K వీడియోలను  చూడాలంటే  ప్రీమియం సబ్‌ స్క్రిప్షన్ తప్పని చేయాలని భావిస్తోంది. ఈ విషయానికి సంబంధించి యూట్యూబ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, ఈ దిశగా చాలా ఇండికేషన్స్ ఇస్తోంది. పలు నివేదికలు సైతం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. 4K వీడియోలను వీడియోలను చూడాలంటే ప్రీమియం సబ్‌ స్క్రిప్షన్ తీసుకోవాలనే సందేశాలు వస్తున్నట్లు వినియోగదారులు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. 


వాస్తవానికి 4K స్మార్ట్ టీవీలు ఉన్న వారు ఎక్కువ రెజల్యూషన్ వీడియోలు చూడటానికి ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే 4K వీడియోలు చూసే వారిని ప్రీమియం గొడుగు కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది యూట్యూబ్. ప్రస్తుతం గూగుల్ అకౌంట్ ఉన్నవాళ్లు  యూట్యూబ్ లో  4K వీడియోలు చూసే అవకాశం ఉంది. అయితే, గత కొద్ది రోజులుగా YouTube వీడియోలు చూస్తున్న సమయంలో యాడ్స్ వస్తున్నప్పుడు..  యూట్యూబ్ ప్రీమియం ఉన్న వాళ్లే 4K వీడియోలు చూడగలుగుతారనే మెసేజ్ డిస్ ప్లే అవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే.. మరికొద్ది రోజులు మాత్రమే ఉచితంగా 4K వీడియోలను చూసే వెసులుబాటు ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత 2K వీడియోలను మాత్రమే ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. అంతకంటే బెటర్ క్వాలిటీ కావాలంటే తప్పకుండా డబ్బులు చెల్లించి తీరాల్సిందే!


భారత్ లో యూట్యూబ్ ప్రీమియం సబ్‌ స్క్రిప్షన్ ధరలను పరిశీలిస్తే నెలకు రూ.129 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మూడు నెలలకు రూ.399.. సంవత్సరానికి రూ.1,290 పే చేయాలి.  ఫ్యామిలీ ప్లాన్ నెలకు రూ.189 నుంచి ప్రారంభం అవుతుంది. ఫ్యామిలీలోని ఐదుగురు సభ్యులకు ఈ  సబ్‌ స్క్రిప్షన్ యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే నెలకు  రూ.79 నుంచి మొదలవుతుంది.  ప్రీమియం సబ్‌ స్క్రిప్షన్ పొందిన వినియోగదారులు ఎలాంటి యాడ్స్ లేకుండా వీడియోలను చూసే వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు..  పిక్చర్ ఇన్ పిక్చర్ ప్లే బ్యాక్ ఫీచర్ ను పొందే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ ప్రీమియం మ్యూజిక్ యాక్సెస్ సైతం పొందవచ్చు.


గడిచిన కొంత కాలంగా  ప్రీమియం సబ్‌ స్క్రిప్షన్ పెంచుకునేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది యూట్యూబ్. ఇప్పటికే ఉచితంగా వీడియోలను చూసే వారికి  స్కిప్ చేసే అవకాశం లేని యాడ్స్ ను అమలు చేస్తోంది. మొత్తంగా మరికొద్ది రోజుల్లోనే యూట్యూబ్ పూర్తిగా కమర్షియల్ గా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. 4K వీడియోలను ఉచితం నుంచి తొలగించగానే.. ప్రీమియం సబ్‌ స్క్రిప్షన్ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని యూట్యూబ్ భావిస్తోంది. అయితే, వినియోగదారుల నుంచి ఏమేరకు సహకారం ఉంటుందో వేచి చూడాల్సిందే!


Also Read: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!


Also Read: మహిళలూ, మీరు ఈ వయస్సుకు వస్తే ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి! లేకపోతే..