ప్రపంచ నంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో తన యూజర్లకు కొత్త ఫీచర్లు అందించనుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. వాట్సాప్ కు సంబంధించిన ఫీచర్ల గురించి అప్ డేట్లను అందించే WABetaInfo వెబ్ సైట్లో వీటిని అందించారు. వాట్సాప్ సీఈవో విల్ కాత్ కార్ట్ కూడా వీటిలో కొన్ని ఫీచర్ల గురించి ఎక్స్ క్లూజివ్ గా తెలిపారు.
వాట్సాప్ తన వినియోగదారులకు ఆరు కొత్త ఫీచర్లను అందించనుంది. వీటిలో కొన్ని టెస్టింగ్ దశలో ఉండగా, కొన్ని బీటా యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ ఫీచర్లు ఇవే..
1. చాట్ బబుల్స్ డిజైన్ లో మార్పులు
వాట్సాప్ చాట్ బబుల్స్ లో మార్పులు రానున్నాయి. వీటిని కంపెనీ పూర్తిగా రీడిజైన్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు అందుబాటులో ఉన్న కొత్త డిజైన్ లో చాట్ బబుల్స్ పెద్దగా, గుండ్రటి ఆకారంలో ఉన్నాయి. ఈ కొత్త చాట్ బబుల్స్ లైట్ మోడ్, డార్క్ మోడ్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.
2. ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్ తరహాలో మెసేజ్ రియాక్షన్లు
ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ల్లో మనం ఎవరితో అయినా చాట్ చేసేటప్పుడు వారు పంపే మెసేజ్ లకు రియాక్షన్లు ఇవ్వవచ్చు. అదే తరహా ఫీచర్ ను ఇప్పుడు వాట్సాప్ లో కూడా తీసుకురానున్నారు. మీరు ఏ మెసేజ్ కి అయితే రియాక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజ్ ను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కింద రియాక్షన్ ఎమోజీలు కనిపిస్తాయి. వాటికి మీకు నచ్చిన ఎమోజీని ఇవ్వవచ్చు.
3. వాయిస్ మెసేజ్ లు పంపేముందే వినవచ్చు
వాట్సాప్ కొత్త ఇంటర్ ఫేస్ లో వాయిస్ మెసేజ్ లను పంపడాని కంటే ముందే వినవచ్చు. ఒకవేళ మీరు రికార్డ్ చేసిన వాయిస్ మెసేజ్ నచ్చకపోతే డిలీట్ చేసి మళ్లీ రికార్డ్ చేయవచ్చు.
4. వాట్సాప్ కాంటాక్ట్ కార్డు లుక్ లో మార్పులు
వాట్సాప్ లో మనం ఎవరి కాంటాక్ట్ అయినా ఓపెన్ చేస్తే అక్కడ వారి కాంటాక్ట్ వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ కాంటాక్ట్ కార్డులో కూడా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
5. వాట్సాప్ లోనే ఫొటో ఎడిటింగ్
వాట్సాప్ లో ఫొటోలు ఎడిట్ చేసుకోవడం, వాటిపై స్టిక్కర్లను యాడ్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. ఈ ఎడిటింగ్ ఆప్షన్లకు డ్రాయింగ్ టూల్స్ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది.
6. కొత్త పేమెంట్ షార్ట్ కట్
వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త పేమెంట్ షార్ట్ కట్ అందించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వినియోగదారులు పేమెంట్లను వేగంగా చేయవచ్చు.
Also Read: iPhone 13: కొత్త ఐఫోన్లు వచ్చేస్తున్నాయి.. ఈసారి మరిన్ని కొత్త రంగుల్లో!
Also Read: రూ.15 వేలలోపే భారతీయ బ్రాండ్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు!
Also Read: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 11 వంటి ఫీచర్లు!