ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు చేస్తున్న మోసాలు, అన్యాయాలను ఎండగట్టేందుకు తెలుగు దేశం పార్టీ సిద్ధమైంది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరుతో ఐదు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీన్ని విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అధికార ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసన తెలపాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఏపీలోని ఐదు జోన్లలో రోజుకి ఒక జోన్ పరిధిలో మొత్తం 35 నియోజకవర్గాల్లో 'రైతు కోసం తెలుగుదేశం' పేరిట కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు.
'రైతు కోసం తెలుగుదేశం' షెడ్యూల్ వివరాలు..
సెప్టెంబర్ 14 (జోన్-5) : నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప పరిధిలో రైతు కోసం తెలుగు దేశం నిరసనలు జరుగుతాయి.
సెప్టెంబర్ 15 (జోన్-2) : కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు పరిధిలో రైతుల కోసం నిరసనలను చేపట్టనున్నట్లు టీడీపీ తెలిపింది.
సెప్టెంబర్ 16 (జోన్-4) : ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, రాజంపేట, చిత్తూరు పరిధిలో రైతు కోసం తెలుగు దేశం పేరిట నిరసనలు కొనసాగనున్నాయి.
సెప్టెంబర్ 17 (జోన్-1): విశాఖపట్నం, విజయనగరం, అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి లోక్‌సభ స్థానాల పరిధిలోని 35 శాసనసభ నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
సెప్టెంబర్ 18 (జోన్-3) : విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, నరసరావు పేట, బాపట్ల లోక్‌సభ స్థానాల పరిధిలోని 35 శాసనసభ నియోజకవర్గాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది.