WhatsApp Business Festival offer: భారత్​లో చిరు వ్యాపారుల కోసం మెటాకు చెందిన వాట్సప్‌  బిజినెస్‌లో పలు కొత్త ఫీచర్లను తాజాగా తీసుకొచ్చింది. వినియోగదారులు నమ్మకమైన సంస్థలను గుర్తించేందుకు వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టింది. మరింత మెరుగైన మెసేజింగ్‌ సేవల కోసం కృత్రిమ మేధ టూల్స్‌ను చేర్చింది. పూర్తి వివరాలు కథనంలోకి వెళ్లి తెలుసుకుందాం. 


యూజర్స్​ను మరింత ఆకర్షించడానికి కొత్త ఫీచర్లు


ఈ ప్రపంచంలోనే అత్యధిక మంది వాడే మెసేజింగ్​ యాప్స్​లో వాట్సాప్ ఒకటి. ఈ ఇన్‌స్టెంట్​ మెసేజింగ్ అప్లికేషన్‌  కేవలం ఎంటర్​టైన్మెంట్​, సందేశాల కోసం మాత్రమే కాదు చిరు వ్యాపారుల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇదే సమయంలో తమ యూజర్స్​ను మరింత ఆకర్షించడానికి వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగు చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ అప్లికేషన్​​ అందరి కన్నా అగ్ర స్థానంలో కొనసాగుతూ ముందుకెళ్తోంది. 


అయితే తాజాగా దసరా పండగ సీజన్​ దగ్గర పడుతున్న నేపథ్యంలో మెటాకు చెందిన వాట్సప్‌ బిజినెస్‌ (WhatsApp Business)లో పలు కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. చిరు వ్యాపారులు, వారి వినియోగదారులతో మరింత మెరుగ్గా అనుసంధానం ​ అయ్యేలా ఈ తాజా ఫీచర్లను అందిస్తోంది. వాట్సప్‌ బిజినెస్‌ యాప్‌లో మెటా వెరీఫైడ్, కస్టమైజ్డ్‌ ​ మెసేజ్‌లను తీసుకొచ్చింది. భారత్‌లో చిరు వ్యాపారాల వృద్ధికి తోడ్పాటు ఇచ్చేందుకు వీటిని తీసుకొచ్చినట్లు మెటా పేర్కొంది. 


వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ సదుపాయం


వినియోగదారులు నమ్మకమైన సంస్థలను గుర్తించేందుకు ఈ వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ సదుపాయం ఉపయోగపడుతుంది. మరింత మెరుగైన మెసేజింగ్‌ సేవల కోసం కృత్రిమ మేధ టూల్స్‌ను చేర్చింది. వినియోగదారులతో మరింగా మెరుగ్గా ఎంగేజ్​మెంట్​ అయ్యేలా వాట్సప్‌ బిజినెస్‌ యాప్‌పై కృత్రిమ మేధను యాక్టివేట్‌ చేయనున్నట్లు మెటా తెలిపింది.  ప్రస్తుతం భారత్‌లో ఇది పరీక్షల దశలో ఉంది.  అయితే దీని ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నయని మెటా  వివరించింది. ఇకపై ఈ వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌లో  తమ వినియోగదారులకు వ్యక్తిగతంగా సందేశాలు, అపాయింట్‌మెంట్‌ రిమైండర్లు, పుట్టిన రోజు శుభకాంక్షలు, హాలిడే సేల్స్‌ను పంపేలా సదుపాయాన్ని కల్పించింది.   ఒకేసారి అందరికీ ఒకేలా మెసేజులు కాకుండా, వ్యాపారులు​ కస్టమైజ్డ్‌ ​ మెసేజ్‌లను ​ కస్టమర్లకు పంపొచ్చు.


"భారత్​లో వాట్సాప్​ బిజినెస్​ యాప్​ను మిలియన్ల మంది చిరు వ్యాపారులు వినియోగిస్తున్నారు. వారు తమ కస్టమర్లలో మరింత విశ్వాసాన్ని బలపరచుకోవాలని అనుకుంటున్నారు. వారి కోసం ఈ కొత్త ఫీచర్లను అందుబాటులో తీసుకొస్తున్నాం. సరైన డిజిటల్​ స్కిల్స్​తో చిరు వ్యాపారులు ఇండియా డిజిటల్ ఎకానమీని సూపర్ చార్జ్​ చేయగలరని మేం నమ్ముతున్నాం. అందుకే మేం చిన్న వ్యాపారులను వాట్సాప్ బిజినెస్ అకౌంట్​ ఎలా సెట్​ చేసుకోవాలి, కేటలాగ్స్​ను ఎలా క్రియేట్​ చేయాలి సహా పలు విషయాలపై అవగాహన కల్పించేలా ట్రైనింగ్​ ఇస్తాం. " అని మెటా పేర్కొంది. కాగా, టైర్​ 2, టైర్ 3 సిటీస్​లో చిన్న వ్యాపారులకు ఈ అవగాహన కల్పించాలని మెటా భావిస్తోంది.


Also Read: Patricia Narayan : 17 ఏళ్లకే లవ్ ఫెయిల్ - రోడ్డు పక్కన కాఫీ అమ్మారు -ఇప్పుడు కోట్లకు అధిపతి - ఈ మహిళ సాధించారు !