Twitter Alternative Bluesky Launched: మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ మాజీ CEO జాక్ డోర్సే ట్విట్టర్‌కు పోటీగా బ్లూ స్కై అనే యాప్‌ను విడుదల చేశారు. 2021 నవంబర్‌లో జాక్ డోర్సే ట్విట్టర్ సీఈవో పదవికి రాజీనామా చేశారు. ట్విట్టర్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి జాక్ డోర్సేనే.


ప్రస్తుతం బ్లూ స్కైని ప్రారంభించడం ద్వారా జాక్ డోర్సే ట్విట్టర్‌కు గట్టి ఛాలెంజ్ ఇవ్వవచ్చు. ఈ యాప్ ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే అందుబాటులో ఉంది. అది కూడా యాపిల్ యాప్ స్టోర్‌లో మాత్రమే ఉంది. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం త్వరలో కంపెనీ దీన్ని అధికారికంగా లాంచ్ చేయనుంది.


ఈ యాప్ ఇంటర్‌ఫేస్ ఖచ్చితంగా ట్విట్టర్ లాగానే ఉంది. యూజర్స్ ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం, ఫాలో చేయడం మొదలైనవాటిని ఎలా చేయవచ్చో ఈ యాప్ కూడా అదే దాదాపు విధంగా పనిచేస్తుంది.


బ్లూ స్కై ఇంటెలిజెన్స్ సంస్థ డేటా.ఏఐ తెలుపుతున్న దాని ప్రకారం ఈ యాప్ ఫిబ్రవరి 17వ తేదీన మొదట అందుబాటులోకి వచ్చింది. టెస్టింగ్‌లో ఇప్పటి వరకు రెండు వేల కంటే ఎక్కువ సార్లు ఇన్‌స్టాల్ చేశారు. ప్రస్తుతం ఈ యాప్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. రాబోయే కాలంలో దీనికి కంపెనీ మరిన్ని అప్‌డేట్‌లు చేసే అవకాశం ఉంది.


బ్లూ స్కైకి ఆదరణ ఎందుకు పెరుగుతుంది?
ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన తర్వాత ఎలోన్ మస్క్ దాని కోసం పెయిడ్ వెరిఫికేషన్ సర్వీసును ప్రకటించారు. అంటే యూజర్స్ ఇప్పుడు ట్విట్టర్‌లో బ్లూ టిక్‌ల కోసం నగదు చెల్లించాలి. బ్లూ టిక్‌కు మాత్రమే కాకుండా అనేక సేవలకు కంపెనీ ఈ ఛార్జీని తీసుకుంటుంది.


ఇటీవల ట్విట్టర్ సాధారణ వినియోగదారుల కోసం టెక్స్ట్ బేస్డ్ ఆథెంటికేషన్ సిస్టంను కూడా తొలగించింది. అంటే ఇప్పుడు ట్విట్టర్ బ్లూను ఉపయోగిస్తున్న వ్యక్తులు మాత్రమే ఈ పద్ధతితో తమ అకౌంట్‌ను వెరిఫై చేసుకోగలరు. అయితే బ్లూ స్కై అనేది పూర్తిగా ఉచితం. ట్విట్టర్‌ను ప్రపంచంలోనే టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల సరసన నిలిపిన జాక్ డోర్సే దీన్ని లాంచ్ చేస్తున్నందున దీనికి ఆదరణ పెరిగే అవకాశం ఉంది.


భారతదేశంలో ట్విటర్ బ్లూ కోసం వెబ్ వినియోగదారులు రూ. 650 చెల్లించాలి. ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారులు మాత్రం ప్రతి నెలా రూ. 900 చెల్లించాలి. ట్విట్టర్ తర్వాత మెటా కూడా పెయిడ్ వెరిఫికేషన్ సర్వీసును ప్రకటించింది. ప్రస్తుతం మెటా అందిస్తున్న ఈ సర్వీస్ కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.


2023 మార్చి 20వ తేదీ తర్వాత ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లు టెక్స్ట్ మెసేజ్ ఆధారిత టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకోలేరని ట్విట్టర్ బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. మీరు ఇంకా ట్విట్టర్ బ్లూ సేవను తీసుకోకపోతే ఈ అప్‌డేట్ మీకు ముఖ్యమైనది. ఎందుకంటే మీరు మార్చి 20వ తేదీ తర్వాత టెక్స్ట్ మెసేజ్ ద్వారా మీ ఖాతాను వెరిఫై చేయలేరు.


మీరు టెక్స్ట్ మెసేజ్ ద్వారా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయాలనుకుంటే దీని కోసం మీరు ట్విట్టర్ బ్లూ సర్వీస్ తీసుకోవాలి. మీరు ట్విట్టర్ బ్లూ సేవను తీసుకోకూడదనుకుంటే మార్చి 20కి ముందు మీ సెట్టింగ్‌ని మార్చాలి. టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ కోసం ఆథెంటికేషన్ యాప్ లేదా సెక్యూరిటీ కీ ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోవాలి.