Smartphone Privacy Problems: కొన్ని సార్లు మనం ఏదైనా వస్తువు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు లేదా దాని గురించి ఎవరికైనా చెప్పినప్పుడు, ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన ప్రకటనలు ఫోన్‌లలో కనిపించడాన్ని మీరు చాలాసార్లు గమనించి ఉండవచ్చు. మన ఫోన్ ద్వారా మనం మాట్లాడుకునే మాటలను ఎవరైనా వింటున్నారా అనేది మన మదిలో వచ్చే మొదటి ప్రశ్న. స్మార్ట్ ఫోన్లలో ఉండే మైక్రోఫోన్‌లు వినియోగదారులపై 24 గంటలు స్పైయింగ్ చేస్తున్నారని ఒక నివేదికలో బయటకు వచ్చింది.
కొన్ని సార్లు మీరు ఫోన్‌లో సెర్చ్ చేయని ఉత్పత్తుల ప్రకటనలు సోషల్ మీడియాలో కనిపించడం తరచుగా జరుగుతుంది. ఈ నివేదిక ప్రకారం ఇటువంటి ప్రకటనలు స్మార్ట్ గాడ్జెట్‌ల సహాయంతో మీకు కనిపిస్తాయి. అవి మీరు చెప్పేది వింటాయి. యాడ్ ఏజెన్సీలు ఇటువంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటాయి.
ఇలా ఎందుకు జరుగుతుంది?
కాక్స్ మీడియా గ్రూప్ కథనం ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా, మైక్రోఫోన్‌లను కలిగి ఉన్న టీవీలు లేదా స్పీకర్‌లు కూడా వ్యక్తుల సంభాషణలను వింటాయి. ఇవి మీరు మాట్లాడుకునే మాటలను వింటాయి. ఆపై మీకు సంబంధించిన డేటా బ్యాంక్ రెడీ అవుతుంది. ఈ డేటా కారణంగానే మీరు రియల్ టైమ్ యాడ్స్‌ను చూడటం ప్రారంభిస్తారు. ఇంటర్నల్ మైక్రోఫోన్ కారణంగా మీ వీకెండ్ ప్లాన్స్ నుంచి ఫ్యూచర్ ప్లాన్స్ వరకు మీరు చెప్పే ప్రతిదాన్ని మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వింటోంది.
Read Also: ఎండలతో సతమతమవుతున్న జనాలకు కూల్ న్యూస్, సోనీ నుంచి సరికొత్త పాకెట్ ఏసీ వచ్చేస్తోంది!
స్మార్ట్ టీవీలో వాయిస్ కమాండ్‌ల వల్ల కూడా ఇది కనిపిస్తుంది. వాయిస్ కమాండ్ అంటే మీరు మాట్లాడటం ద్వారా టీవీలో ఏదైనా సెర్చ్ చేయవచ్చు. ఇది టీవీలో ఉన్న మైక్రోఫోన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అనుమతి లేకుండా ఏ పరికరం మైక్రోఫోన్‌ను ఉపయోగించదని గూగుల్, యాపిల్ పేర్కొన్నాయి. మీ డివైస్ మైక్రోఫోన్‌ని యాక్టివేట్ చేసినప్పుడల్లా స్టేటస్ బార్‌లో ఐకాన్ కనిపిస్తుందని, దానికి మీ అనుమతి అవసరమని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.
మీ పర్మిషన్ లేకుండా ఐఫోన్ లేదా ఐప్యాడ్ మైక్రోఫోన్ లేదా కెమెరాను ఏ యాప్ యాక్సెస్ చేయలేదని కూడా యాపిల్ పేర్కొంది. ఐవోఎస్, ఐప్యాడ్ఓఎస్ అన్ని వెర్షన్‌లలో యాప్స్ మైక్రోఫోన్ లేదా కెమెరాను ఉపయోగించినప్పుడు మీకు ప్రాంప్ట్ కనిపిస్తుంది.
దీని నుంచి ఎలా తప్పించుకోగలం?
ఆండ్రాయిడ్ యూజర్లు ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. దీని తర్వాత మళ్లీ ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఇక్కడ మీరు మైక్రోఫోన్, కెమెరా, ఇతర సెన్సార్ల గురించి సమాచారాన్ని పొందుతారు. మీరు ఏ యాప్‌కు పర్మిషన్ ఇచ్చారో తెలుసుకోవచ్చు. ఈ పర్మిషన్‌ను బ్లాక్ చేయవచ్చు లేదా తీసివేయవచ్చు.
ఐవోఎస్‌లో సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మైక్రోఫోన్ లేబుల్‌ని చూస్తారు. దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు మైక్రోఫోన్ యాక్సెస్ ఏ యాప్‌కు అయితే వద్దనుకుంటున్నారో ఆ యాప్‌కు తీసేయవచ్చు.
Read Also: ‘మదర్స్ డే’ గిఫ్ట్ ఐడియాస్ - ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్స్‌తో అమ్మను సర్ ప్రైజ్ చెయ్యండి!