Sony Wearable AC: ఎలక్ట్రానిక్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోనీ కంపెనీ, సరికొత్త ఆవిష్కరణలతో దూసుకెళ్తోంది. వేసవిలో ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం మరో స్మార్ట్ గాడ్జెట్ ను విడుదల చేసింది. ఇంకా చెప్పాలంటే, మెడ వెనుక భాగంలో ధరించే చిన్న ఏసీని అందుబాటులోకి తెచ్చింది. ఎక్కడికైనా దీనిని ఈజీగా తీసుకెళ్లేలా రూపొందించింది. చలికాలంలో వేడి, ఎండాకాలంలో చల్లదనాన్ని కలిగించేలా దీనిని రూపొందించింది. రియాన్ పాకెట్-5 పేరుతో ఈ డివైజ్ ను మార్కెట్లోకి తెస్తోంది.
రియాన్ పాకెట్ 5 డివైజ్ ఎలా పని చేస్తుందంటే?
రియాన్ పాకెట్ 5 డివైజ్ పరిసరాల ఉష్ణోగ్రత ఆధారంగా పని చేస్తుంది. ఈ డివైజ్ ను ఆన్ చేసి మెడ వెనుక భాగంలో ధరించగానే, ముందుగా బాడీ టెంపరేచర్ ను అంచనా వేస్తుంది. ఆ తర్వాత వాతావరణంలోని ఉష్ణోగ్రత స్థాయిని గుర్తిస్తుంది. వాతావరణం వేడిగా ఉంటే, శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. వాతావరణం చల్లగా ఉంటే శరీరానికి అవసరమైన వేడిని అందిస్తుంది. ఈ డివైజ్ ను వినియోగదారులు ప్రత్యేకంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉండదు. తనంతట తానే పని చేస్తుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా టెంపరేచర్ ను సెట్ చేస్తుంది. ఒకవేళ అసవరం అనుకుంటే మొబైల్ యాప్ ద్వారా స్పెషల్ గా కమాండ్స్ ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ తో పాటు ఐఫోన్ల ద్వారా ఈ యాప్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.
ప్రత్యేకంగా ఆన్, ఆఫ్ చేయాల్సిన పని లేదు!
ఇంకా చెప్పాలంటే రియాన్ పాకెట్ 5 డివైజ్ ను ప్రత్యేకంగా ఆన్, ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మెడ భాగంలో ధరించగానే ఆటోమేటిక్ గా పని చేయడం ప్రారంభిస్తుంది. మళ్లీ తీయగానే ఆగిపోతుంది. ఇక వాతావరణ పరిస్థితులను అంటే వేడి, తేమను గుర్తించడానికి ఇందులో ప్రత్యేకంగా సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఈ డివైజ్ లో మొత్తం ఆయా పరిస్థితులను అంచనా వేసేందుకు 5 సెన్సార్లు ఉంటాయి. వీటికి తోడుగా ఒక ప్యాకెట్ ట్యాగ్ కూడా ఉంటుంది. దీనిని షర్ట్ పాకెట్ లో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్యాగ్ వాతావరణంలోని టెంపరేచర్ ను గుర్తించి రియాన్ పాకెట్ డివైజ్ కు అందిస్తుంది. అయితే, ఈ ట్యాగ్ లేకున్నా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ పాకెట్ ట్యాగ్ అనేది కచ్చితమైన టెంపరేచర్ ను అంచనా వేయడంలో సాయపడుతుందని తెలిపింది.
బ్యాటరీ లైఫ్ ఎన్ని గంటలు? ధర ఎంత అంటే?
ఇక ఈ రియాన్ పాకెట్ డివైజ్ ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే సుమారు 17 గంటల పాటు పని చేస్తుంది. ఈ డివైజ్ ధర 170 అమెరికన్ డాలర్లు. అంటే, భారత కరెన్సీలో సుమారు రూ. 14,186. ప్రస్తుతం ఈ డివైజ్ భారత మార్కెట్లో అందుబాటులో లేదు. త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. వాస్తవానికి ఈ డివైజ్ 2019లోనే మార్కెట్లోకి తీసుకొచ్చింది. నెమ్మదిగా ఈ డివైజ్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తెలుస్తోంది. ప్రస్తుతం రియాన్ పాకెట్ 5 డివైజ్ ను యూరప్ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. సింగపూర్ లో మే నుంచి అందుబాటులోకి రానుంది. మలేషియా, థాయ్ లాండ్, వియత్నాం మార్కెట్లలోకి కూడా త్వరలో పరిచయం చేయనుంది.
Read Also: వావ్ అనిపించే ఏఐ టూల్‌ని తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ - ఒరిజినల్ అనిపించే ఫేక్ వీడియోలతో!