TRAI New Proposal on Phone number: కొన్నేళ్ల కిందట  సిమ్‌ కార్డు పొందాలంటే నానాయాతన పడాల్సి వచ్చేది.  కష్టంతో పాటు కొంతమేర డబ్బులు కూడా చెల్లించాల్సి వచ్చేది. రానురానూ టెక్నాలజీ మారిపోయి టెలికాం కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడింది. దీంతో కంపెనీలు ఉచితంగానే సిమ్ కార్డులు జారీ చేయడం ప్రారంభించాయి.  సిమ్ తో పాటు ఇంటర్నెట్ డేటా, కాల్స్ కూడా ఉచితంగా ఇవ్వడంతో చాలామంది ఎగబడి సిమ్ కార్డులు తీసుకునేవారు. డేటా, కాల్స్ వాడుకుని తర్వాత వాటిని పక్కన పడేసేవారు. ఇలా చేస్తున్నట్లు ట్రాయ్ దృష్టికి రావడంతో సిమ్ కార్డుల జారీపై గరిష్ఠ పరిమితి విధించింది. తర్వాత ఈ తరహా దుర్వినియోగం కాస్త తగ్గింది. ఈ క్రమంలోనే టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) కొత్త సిఫార్సులకు రెడీ అయింది. ఇకపై ఫోన్‌ నంబర్‌కు, ల్యాండ్‌లైన్‌ నంబర్‌కు ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తుంది. అదే జరిగితే టెలికాం కంపెనీల నుంచి తొలుత ఈ ఛార్జీలు వసూలు చేస్తే.. ఆయా కంపెనీలు వినియోగదారుల నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. 


భారత్‌లో టెలికాం రంగంలో భారీ మార్పు
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీని కారణంగా భారతదేశంలో టెలికాం ప్రపంచం పూర్తిగా మారుతోంది. మార్చి 2024 నాటికి భారతదేశంలో 1.19 బిలియన్ల కంటే ఎక్కువ ఫోన్ కనెక్షన్లు ఉంటాయి . ప్రస్తుతం దేశంలో  టెలి-సాంద్రత 85.69శాతానికి చేరుకుంది. అంటే ప్రతి 100 మందిలో 85 మందికి టెలిఫోన్ కనెక్షన్ ఉంది. దీంతో ఫోన్ నంబర్లకు డిమాండ్ కూడా బాగా పెరిగింది. ఈ సవాలును ఎదుర్కోవడానికి ట్రాయ్ కొత్త నంబరింగ్ ప్లాన్‌ను ప్రతిపాదించింది. ఈ ప్లాన్ కింద టెలికాం కంపెనీలకు ఫోన్ నంబర్లు క్రమ పద్ధతిలో జారీ చేస్తుంది. ఇది అనేక రకాల సేవలకు మద్దతు ఇవ్వడమే కాకుండా టెలికాం రంగం కూడా సులభంగా విస్తరిస్తుంది. ఫీజు విధానాన్ని అమలు చేయడం ద్వారా మొబైల్ నంబర్లను అందించే నిబంధన కఠినంగా ఉంటుందని  ట్రాయ్ భావిస్తోంది. ఇది టెలికాం కంపెనీలు ఫోన్ నంబర్లను సమర్థవంతంగా, పారదర్శకంగా ఉపయోగించుకునేందుకు ప్రోత్సహిస్తుంది.


ఫోన్ నంబర్లు పరిమిత ఆస్తి
టెలికాం టెక్నాలజీలో వస్తున్న మార్పుల దృష్ట్యా నంబరింగ్ సిస్టమ్‌పై సమీక్ష అవసరమని ట్రాయ్ చెబుతోంది. ఫోన్ నంబర్లు పరిమిత పబ్లిక్ ఆస్తి అని వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చూసేందుకు వాటిపై రుసుము విధించాలని ట్రాయ్ ప్రతిపాదించింది.  పోన్ నంబర్ల  దుర్వినియోగానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఓ ఇంగ్లిష్​ పత్రిక పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని మొబైల్‌ ఫోన్లు డ్యూయల్‌ సిమ్‌ కార్డు ఆప్షన్‌తో వస్తున్నాయి. అందరూ రెండో సిమ్‌ కార్డు వాడుతున్నారు.. వాటిలో ఒకటే నిత్యం వాడుకలో ఉంచి.. రెండో దానికి ఎప్పుడోగానీ రీఛార్జ్ చేయడం లేదు. అయితే, కస్టమర్‌ బేస్‌ తగ్గిపోతుందేమో అన్న భయంతో ఆయా కంపెనీలు కూడా అటువంటి నంబర్ల జోలికి పోవడం లేదు. వాటిని తొలగించకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నాయి.  దీంతో తక్కువ వినియోగించే నంబర్ల విషయంలో ఆయా టెలికాం కంపెనీలకు ట్రాయ్ పెనాల్టీ విధించాలని అనుకుంటుంది.


ఇతర దేశాల్లోనూ సేమ్ సిస్టమ్
సాధారణంగా స్పెక్ట్రమ్‌ తరహాలోనే నంబరింగ్‌ స్పేస్‌ ప్రభుత్వమే ఆయా కంపెనీలకు కేటాయిస్తుంది. గత డిసెంబర్లో ఆమోదం పొందిన టెలికాం చట్టంలోనూ నంబర్‌కు ఛార్జీ వసూలు చేయాలన్న నిబంధన గురించి ఉంది.  ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, యూకే, లిథువేనియా, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్ వంటి అనేక దేశాలు ఇప్పటికే ఫోన్ నంబర్లకు ఛార్జీ విధించాయి. భారత్ లోనూ నంబర్ల సమర్థ నిర్వహణ కోసం ట్రాయ్ కూడా ఇదే విధమైన చర్య తీసుకోవాలని కోరుతోంది. అయితే, ఒక్కో నంబర్‌కు ఒకసారి మాత్రమే వసూలు చేయాలా..? లేదా నంబరింగ్‌ సిరీస్‌కు ఏటా కొంత మొత్తంలో వసూలు చేయాలా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ట్రాయ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన సిఫార్సులను ట్రాయ్‌ త్వరలోనే  ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది.