5G సర్వీసులో సామ్ సంగ్ సరికొత్త రికార్డు


ప్రముఖ టెక్ సంస్థ సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ అద్భుతం సాధించింది. ఆస్ట్రేలియాలో ఇటీవల నిర్వహించిన 5G ఫీల్డ్ ట్రయల్‌ లో సరికొత్త రికార్డును సాధించింది. 10 కి.మీ దూరంలో 1.75 Gbps డౌన్ లోడ్ స్పీడ్ సాధించినట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం నేషనల్ బ్రాడ్‌ బ్యాండ్ నెట్‌ వర్క్‌ ను హోల్‌ సేల్ బ్రాడ్‌ బ్యాండ్ ప్రొవైడర్‌ గా డిజైన్ చేయాలని భావించింది. ఇందుకోసం  ఆస్ట్రేలియన్ ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ యాజమాన్యంలోని కార్పొరేషన్ NBN కో లిమిటెడ్ ట్రయల్ నిర్వహించింది.  సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ తో కలిసి ఈ ట్రయల్స్ చేసింది. దీని ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని NBN కోలోని చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రే ఓవెన్ తెలిపారు. ఆస్ట్రేలియాలో డిజిటల్ సామర్థ్యాలను మరింత మెరుగు పరచబోతున్నట్లు తెలిపారు. తాజాగా నిర్వహించిన ఈ ట్రయల్స్ లో సగటు అప్‌లోడ్ వేగం 61.5 Mbpsగా, డౌన్ లోడ్ వేగం 1.75 Gbps గా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.






హైకెపాసిటీ 5G నెట్ వర్క్, విస్తృత కవరేజీ


ట్రయల్స్ సమయంలో సామ్ సంగ్ కంపెనీ 5G mmWave స్పెక్ట్రమ్ (5G వైర్‌లెస్ కమ్యూనికేషన్‌ల కోసం ఉపయోగించబడుతున్న చాలా హై-ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలు)  పట్టణ ప్రాంతాలలో హై-కెపాసిటీ 5G నెట్‌ వర్క్‌ లను నిర్మించడానికి మాత్రమే కాకుండా, విస్తృత కవరేజీని కూడా అందించగలదని నిరూపింత అయినట్లు సామ్ సంగ్  కంపెనీ నిరూపించింది.  సామ్ సంగ్  తన 28GHz కాంపాక్ట్ మాక్రో,  థర్డ్-పార్టీ 5G mmWave కస్టమర్ ప్రిమిసెస్ పరికరాలను ట్రయల్‌లో ఉపయోగించింది. సామ్ సంగ్  కాంపాక్ట్ మాక్రో అనేది mmWave స్పెక్ట్రమ్ కోసం రూపొందించిన తొలి ఇంటిగ్రేటెడ్ రేడియో. ఇది బేస్‌బ్యాండ్, రేడియో, యాంటెన్నాను ఒకే ఫారమ్ ఫ్యాక్టర్‌గా అనుసంధానిస్తుంది.


మారుమూల ప్రాంతాల్లోనూ 5G కనెక్టివిటీ


"ఈ కొత్త 5G రికార్డు mmWave టెక్నాలజీకి సంబంధించిన భారీ సామర్థ్యాన్ని సూచిస్తుంది.  గ్రామీణ ప్రాంతాల్లోనూ పూర్తి స్థాయిలో నెట్ వర్క్ ను అందించే అవకాశం ఉంటుంది. మెరుగైన కనెక్టివిటీ కోసం mmWave టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది” అని సామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్ నెట్‌వర్క్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, R & D హెడ్ జునేహీ లీ వెల్లడించారు. 2018లో సామ్ సంగ్  ప్రపంచంలోనే మొట్టమొదటి 5G mmWave FWA సేవలను USలో ప్రారంభించింది. దాని స్వంత చిప్‌ సెట్‌ లు, రేడియోలతో సహా 5G mmWave సొల్యూషన్స్ కు సంబంధించి ఎండ్ టు ఎండ్ పోర్ట్‌ ఫోలియోను అందించడం ద్వారా, గ్లోబల్ 5G mmWave మొమెంటంను డెవలప్ చేసింది.