చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మీ తైవాన్, ఇండోనేషియా దేశాల్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. అదే రియల్‌మీ సీ51. ఇప్పుడు కంపెనీ ఈ ఫోన్‌ను ఇండియాలో కూడా లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ధృవీకరించింది. రియల్ మీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ స్మార్ట్ ఫోన్ ఫొటోను షేర్ చేసింది. అందులో 'ఛాంపియన్ ఈజ్ కమింగ్' అని రాశారు. అలాగే ఫోన్‌లో మినీ క్యాప్సూల్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికి స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ, స్పెక్స్‌ను వెల్లడించలేదు. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో ఇప్పటికే లాంచ్ అయింది.


రియల్‌మీ సీ51 స్పెసిఫికేషన్‌లు
యాపిల్ ఐఫోన్ 14 ప్రో లాంటి డిజైన్ ఈ ఫోన్‌లో ఉంది. అయితే దీని వెనుక భాగంలో డ్యూయల్ టెక్చర్‌తో కూడిన పాలికార్బోనేట్ బిల్డ్ అందించారు. స్మార్ట్‌ఫోన్ హెచ్‌డీ+ రిజల్యూషన్‌ ఉన్న 6.7 అంగుళాల వాటర్-డ్రాప్ నాచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.


ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో వెనకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 0.3MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. యూనిసోక్ టైగర్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం ఉన్న 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో అందుబాటులో ఉంది. 4 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఉన్నాయి.


ధర ఎంత ఉండవచ్చు?
తైవాన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్‌తో కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. అక్కడ ఈ ఫోన్ ధర దాదాపు రూ.10,400గా ఉంది. దాదాపుగా అదే రేంజ్‌లో భారతదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.కొంతకాలం క్రితం భారతదేశంలో రియల్‌మీ సీ55 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.10,999గా ఉంది.


ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ఇటీవలే దీనికి సంబంధించిన రెండర్లు, స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. ఇటీవలే లాంచ్ అయిన రియల్‌మీ సీ55, సీ53ల తరహాలోనే ఇప్పుడు లాంచ్ కానున్న సీ51లో కూడా యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహా ఫీచర్ అందించనున్నారు. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా వెనకవైపు అందుబాటులో ఉంది. దీంతోపాటు వాల్యూమ్ రాకర్స్, పవర్ బటర్ ఫోన్‌కు ఎడమవైపు అందించారు.


రియల్‌మీ సీ53 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో కంపెనీ 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే కూడా ఈ ఫోన్‌లో అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా రియల్‌మీ సీ53లో ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా 12 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకునే అవకాశం ఉంది.


Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!


Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial