Madurai Train Fire Accident: 



మదురైలో ప్రమాదం..


తమిళనాడులోని మదురైలో ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైల్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. రెండు కంపార్ట్‌మెంట్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా...20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు రైల్లోనే గ్యాస్ సిలిండర్‌ ఆన్ చేసి కాఫీ పెట్టేందుకు ప్రయత్నించగా మంటలు వ్యాపించాయి. అప్పటికప్పుడు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి 55 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంటలు వ్యాపించిన వెంటనే ప్రయాణికులంతా ప్రాణాలు కాపాడుకోటానికి పరుగులు పెట్టారు. ఫలితంగా...చాలా సేపటి వరకూ రైల్వే స్టేషన్‌లో అలజడి రేగింది. అయితే...ఈ ప్రమాదానికి కారణాలేంటో అధికారులు విచారణ జరిపి వెల్లడించారు. 




"ఉదయం 5.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. మదురై రైల్వే స్టేషన్‌లో రైల్ ఆగి ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. యూపీ నుంచి వచ్చిన భక్తులు ఈ కోచ్‌లలో ఉన్నారు. తమతో పాటు తెచ్చుకున్న గ్యాస్‌స్టవ్‌ని ఆన్‌ చేశారు. కాఫీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. సిలిండర్ పేలింది. 9 మంది చనిపోయారు. వాళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం"


- ఎమ్ఎస్ సంగీత, మదురై జిల్లా కలెక్టర్


బయట పడ్డ ప్రయాణికులు..


ఈ ప్రమాదం నుంచి బయట పడ్డ ప్రయాణికులు ఇంకా షాక్‌లో నుంచి తేరుకోలేదు. తమకు ఎదురైన ఆ అనుభవాన్ని తలుచుకుంటూ వణికిపోతున్నారు. ఏ మాత్రం ఆలస్యమైనా తామూ మంటల్లో పడి బూడిదైపోయే వాళ్లమని చెబుతున్నారు. 


"నేను సీట్‌లో కూర్చుని ఉన్నాను. ఒక్కసారిగా ప్రయాణికులంతా భయపడిపోయారు. మంటలు వ్యాపిస్తున్నాయని అప్పుడర్థమైంది. వెంటనే పరుగులు తీసి కిటికీ దగ్గరికి వెళ్లాం. కానీ అది లాక్ చేసి ఉంది. ఏదోలా కష్టపడి ఆ కిటికీ తెరిచాం. వెనకాల కూర్చున్న వాళ్లంతా పలుగులు పెట్టారు. కొంత మంది మాత్రం అలాగే చిక్కుకుపోయారు. కొందరు తలుపులు పగలగొట్టి బయటకు వచ్చారు. లగేజ్ అంతా ట్రైన్‌లోనే విడిచిపెట్టి ప్రాణాలు దక్కించుకున్నాం"


- ప్రయాణికులు