Viral Video: 


యూపీలో ఘటన..


యూపీలోని ముజఫర్‌నగర్‌లోని ఓ స్కూల్‌లో జరిగిన ఓ ఘటన సంచలనమవుతోంది. ఓ ముస్లిం విద్యార్థిని ఓ హిందూ విద్యార్థితో కొట్టించింది ఓ మహిళా టీచర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖబర్‌పూర్‌ గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే దీనిపై విచారణ మొదలు పెట్టారు. ఈ వీడియోలో టీచర్‌ ముస్లింలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. క్లాస్‌లో ఉన్న విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని కొట్టాలని ఆదేశించింది. టీచర్‌ చెప్పినట్టుగానే విద్యార్థులంతా ఒకరి తరవాత ఒకరు ఆ ముస్లిం విద్యార్థిని చెంపపై కొట్టారు. ఇలా కొడుతూ ఉండగా చైర్‌లో కూర్చున్న టీచర్ "ఇంకా గట్టిగా కొట్టండి" అంటూ ఆర్డర్‌ వేసింది. ఓ స్టూడెంట్‌ చెంపమీద కొట్టినా ఆగకుండా...నడుముపైన కొట్టండి అంటూ కుర్చీలో కూర్చుని ఆర్డర్‌లు వేసింది ఆ మహిళా టీచర్. ఈ విషయం తెలిసి ఆ ముస్లిం విద్యార్థి తల్లిదండ్రులు గొడవకు దిగారు. ఇదంతా పెద్ద రచ్చ అవుతుందనుకున్న స్కూల్ యాజమాన్యం వాళ్లతో ఓ డీల్ కుదుర్చుకుంది. అడ్మిషన్ ఫీ తిరిగి ఇచ్చేస్తామని చెప్పింది. అందుకు అంగీకరించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే...ఈ వీడియో వైరల్ అవడం వల్ల పోలీసుల వరకూ వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్‌ ప్రిన్సిపల్‌ని విచారిస్తున్నారు. 


"సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యాక కానీ పోలీసులకు ఈ విషయం తెలియలేదు. మ్యాథ్స్ టేబుల్‌ని సరిగ్గా చెప్పలేదన్న కోపంతో ఓ విద్యార్థిని ఇలా దగ్గరుండి మరీ టీచర్ కొట్టించింది. ఈ వీడియోలో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలూ వినబడ్డాయి. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ముస్లింల కుటుంబాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై శ్రద్ధ పెట్టరని, వాళ్ల భవిష్యత్‌ని నాశనం చేస్తారని ఆ టీచర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ని ఏర్పాటు చేశారు"


- పోలీసులు


ఈ వీడియోపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. విద్యార్థుల్లోనూ మత విద్వేషాల్ని రెచ్చగొడుతున్నారని మండి పడ్డారు. ఇలాంటి ఘటనలకు బీజేపీయే కారణమని విమర్శించారు. మరి కొందరు మాత్రం దీనికి మతంతో సంబంధం లేదని వాదిస్తున్నారు.