తమిళనాడులో వేకువజామున ఘోర రైలుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 


తమిళనాడులోని మధురై  రైల్వేస్టేషన్‌లో ఓ స్పెషల్ ట్రైన్‌లో ప్రమాదం జరిగింది. ఈ ట్రైన్ లక్నో నుంచి రామేశ్వరం వెళ్తున్నట్టు సమాచారం. ఈ రైలులోని కొందరు వ్యక్తులు చేసిన పని 9 మంది ప్రాణాల మీదకు తెచ్చింది. గ్యాస్‌సిలిండర్ తీసుకొచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడారు. 
 
మధురై స్టేషన్‌లో రైలు ఆగిన ఉన్న టైంలో కొందరు ప్రయాణికులు టీ కాచుకునేందుకు యత్నించారు. ఇదే ప్రమాదానికి కారణమైంది. సిబ్బందికి తెలియకుండానే రహస్యంగా సిలిండర్‌ను బోగీలోకి తీసుకెళ్లారు. టీ చేస్తున్న టైంలో సిలిండర్ పేలడంతో ప్రమాదం జరిగింది. 


సిలిండర్ పేలుడు ధాటికి ఆ బోగీ పూర్తిగా దగ్దమైపోయింది. స్పాట్‌లోనే కొందరు చనిపోగా... మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 20 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ట్రైన్‌లో 63 మంది ఉన్నట్టు తెలుస్తోంది. బోగీలో మంటలు చెలరేగిన వెంటనే చాలా మంది ప్రయాణికులు మెరుపు వేగంతో కిందికి దూకడంతో క్షేమంగా బయటపడ్డారు.