What is Digital Arrest in Telugu: ప్రస్తుతం మనదేశంలో డిజిటల్ అరెస్ట్ అనే పదం గురించి చాలా చర్చ జరుగుతోంది. డిజిటల్ అరెస్ట్ అనే కొత్త స్కామ్ భారతదేశంలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. చాలా మంది దీనికి బాధితులుగా మారుతున్నారు. దీని గురించి అవగాహన కల్పించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ తన 115వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ స్కామ్ గురించి ప్రజలకు తెలియజేశారు.


డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో బాధితురాలికి సైబర్ నేరగాడు చేసిన కాల్ వీడియో, ఆడియోను ప్రధాని మోదీ చూపించారు. ఆ తర్వాత ఈ స్కామ్ గురించి వివరించారు. ఈ స్కామ్‌ను నివారించేందుకు ప్రధాని మోదీ ప్రజలకు ఒక విషయాన్ని కూడా చెప్పారు. ముందు వేచి ఉండండి, తర్వాత ఆలోచించండి, ఆ తర్వాత చర్య తీసుకోండి అన్నారు. ఇటువంటి కొత్త మోసాలను ప్రజలు ఎలా నివారించవచ్చో తెలిపారు. అలాగే మోసగాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో కూడా ప్రధానమంత్రి చెప్పారు.






డిజిటల్ అరెస్టుపై ప్రధాని మోదీ ఏమన్నారు?
మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ దీనిపై చర్చిస్తూ “డిజిటల్ అరెస్ట్ స్కామ్ చేయాలని పిలిచే మోసగాళ్లు కొన్నిసార్లు పోలీసు, సీబీఐ, నార్కోటిక్స్, ఆర్‌బీఐ వంటి పెద్ద పెద్ద అధికారులం అని చెప్పుకుంటారు. ఈ నకిలీ అధికారులందరూ మీకు నమ్మకం కలిగించేలా మాట్లాడతారు."


"మీ 'వ్యక్తిగత సమాచారం' తెలుసుకోవడమే ఇలాంటి మోసగాళ్ల మొదటి లక్ష్యం. మీరు గత నెలలో గోవా వెళ్లినట్లుగా, మీ కుమార్తె ఢిల్లీలో చదువుతున్నట్లుగా, ఇలా మీ గురించిన మొత్తం సమాచారాన్ని వారు కాల్ చేసే సమయానికే సేకరిస్తారు." అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


ఆ తర్వాత మాట్లాడుతూ... "ఇలాంటి మోసగాళ్ల రెండో దశ... బాధితుడి మనస్సులో భయాందోళనలను సృష్టించడం. దీని కోసం వారు నకిలీ యూనిఫాంలు, ప్రభుత్వ కార్యాలయ సెటప్, చట్టపరమైన సెక్షన్లు మొదలైన వాటి ద్వారా ఫోన్‌లో మిమ్మల్ని చాలా భయపెడతారు. మీకు దాని గురించి కూడా ఆలోచించే సమయం కూడా ఇవ్వరు." అన్నారు.


పీఎం మోడీ ఇంకా మాట్లాడుతూ "టైమ్ ప్రెషర్" పెట్టడం వీరి మొత్తం ప్రణాళికలో మూడో దశ అని చెప్పారు. బాధితులు ఏం చేయాలో అప్పుడే నిర్ణయించుకోవాలని, లేకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవలసి ఉంటుందని వారు చెప్తారని ప్రధాని తెలిపారు. అనంతరం ఈ వ్యక్తులు బాధితురాలిపై చాలా మానసిక ఒత్తిడి తెచ్చారని ఆయన అన్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా మాట్లాడుతూ, "అన్ని వయస్సుల, అన్ని వర్గాల ప్రజలు డిజిటల్ అరెస్టుకు గురవుతున్నారు. అలాంటి భయం కారణంగా చాలా మంది తమ కష్టపడి సంపాదించిన లక్షల రూపాయలను కోల్పోయారు." అని పేర్కొన్నారు.


డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ను ఎలా ఎదుర్కోవాలి?
ఈ కుంభకోణం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే మార్గాన్ని కూడా ప్రధాని వివరించారు. "మీకు ఎప్పుడైనా అలాంటి కాల్ వస్తే, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫోన్ కాల్స్ లేదా వీడియో కాల్‌ల ద్వారా ఏ దర్యాప్తు ఏజెన్సీ ఎప్పుడూ ఇలాంటి విచారణలు చేయదని మీరు తెలుసుకోవాలి." అని ప్రధాని మోదీ అన్నారు.


"మీరు ఇలాంటి మోసగాళ్లను అడ్డుకోవచ్చు. దాని గురించి జాగ్రత్తగా ఆలోచించి, ఆపై చర్య తీసుకోండి. మీరు అలాంటి కాల్స్‌లో వీడియో లేదా ఆడియో రికార్డింగ్ చేయండి. ఆ తర్వాత జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయండి లేదా cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండి. దాని గురించి మీ కుటుంబ సభ్యులకు మరియు పోలీసులకు తెలియజేయండి." అన్నారు. చివరగా చట్టంలో డిజిటల్ అరెస్టు వంటి నిబంధన లేదని, ఇది కేవలం మోసమేనని మరోసారి స్పష్టంగా చెప్పారు.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే