New Data Privacy Rules : ఈ టెక్ యుగంలో చవక ధరలోనే ఇంటర్నెట్ లభిస్తుండడంతో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విరివిగా వినియోగిస్తున్నారు. నగదు చెల్లింపులు, షాపింగ్ అంటూ ప్రతి దానికీ టెక్నాలజీ ఆయుధంగా మారిపోయింది. ముఖ్యంగా చిన్నారులు గంటల కొద్దీ సోషల్ మీడియాలో గడుపుతున్నారు. దీని వల్ల బయట ఆడుకునే సమయం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఫలితంగా ఆనేక అనారోగ్యాల పాలవుతున్నారు. ఇలా అవసరానికి మించి ఉపయోగించి లేని, పోని చిక్కుల్లో పడుతున్నారు. ఈ క్రమంలో చిన్నారులు సోషల్ మీడియా వినియోగంపై కేంద్రం చర్యలు చేపట్టింది. , 18ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.


డేటా ప్రొటెక్షన్ బిల్లు - పిల్లలకు ఎంతో మేలు


కాలక్షేపం కోసం పిల్లలు ఫోన్ వాడడం కామన్. కానీ అదే అదనుగా చేసుకుని వారి వ్యక్తిగత సమాచారాన్ని కొందరు సైబర్ మోసగాళ్లు దొంగిలిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా డేటా ఉల్లంఘనలపైనా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో చిన్నారులను ఇంటర్నెట్‌కు, అందులోను ముఖ్యంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇటీవల కొన్ని దేశాలు చర్యలు తీసుకున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ దిశలో పయనిస్తోంది. ఈ చర్యల్లో భాగంగా డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ 2025కు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 18ఏళ్ల పిల్లలు ఎవరైనా సరే సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పింది. 


డిజిటల్ ఇండియా కోసం, డేటా ప్రొటెక్షన్ బిల్లు (DPDP)ను మొదట్లో 2022లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సంవత్సరం పార్లమెంటులో ఆమోదించబడినప్పటి నుండి ఈ నియమాల అమలుకు చాలా సమయం పట్టింది. ఇప్పుడు అందుబాటులోకి తీసుకురానున్న ఈ కొత్త డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్(డీపీడీపీ) రూల్స్ 2025 పై MyGov పోర్టల్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలపవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సూచించింది. ఏమైనా అభ్యంతరాలుంటే mygov.inలో తెలియజేయాలని చెప్పింది. ఫిబ్రవరి 18 వరకు సలహాలు, సూచనలు తీసుకుంటామని, ఆ తర్వాత ప్రజలు, పలు సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సలహాలను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. 


డేటా సంరక్షణపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉండేలా నిబంధనలు రూపొందించారు. వ్యక్తిగత సమాచారానికి సంబంధించి కంపెనీలు మరింత పారదర్శకంగా ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ యూజర్స్ సమాచారాన్ని 3సంవత్సరాల వ్యవధిలో తొలగించాలి. ఈ డేటా తొలగింపుకు 48గంటల ముందు వారికి తెలియజేయాల్సి ఉంటుంది. వినియోగదారు ఖాతాలలో ప్రొఫైల్, ఫోన్ నంబర్‌లు లేదా సేవలను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఇమెయిల్ అడ్రస్ లాంటి వివరాలు ఇటీవలి కాలంలో దోపిడీకి గురవుతోన్న ఈ సమయంలో ఈ చర్యలు తీసుకున్నారు.


కేంద్ర మంత్రి ట్వీట్


కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ సందర్భంగా ఎక్స్​లో పోస్ట్ చేశారు. "డ్రాఫ్ట్ డిజిటల్ ప్రొటెక్షన్ డేటా బిల్లు నియమాలను సంప్రదింపుల కోసం విడుదల చేస్తున్నాం. దీనిపై ప్రజల అభిప్రాయాలు తెలియజేయాలి" అని సూచించారు. ఇకపోతే డేటా వినియోగానికి సంబంధించిన తప్పులు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఎక్కువగా ఎదుర్కొంటోన్న ఈ సమయంలో ఈ నిబంధనలన్నీ చాలా సంక్లిష్టమైన డిజిటల్ రంగానికి మరింత పారదర్శకతను తెస్తాయని భావిస్తున్నారు.






Also Read : Strict Action on Banned Apps : A కంటెంట్ ను చూపే యాప్స్ పై స్ట్రిక్ట్ యాక్షన్ - ఇండియాలో ఈ వెబ్ సైట్స్ కు నో యాక్సెస్