Google Pixel Smartphone: గూగుల్... ఈ పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది సెర్చింజనే. అన్ని స్మార్ట్ ఫోన్లలో గూగుల్ సెర్చింజన్ కంపల్సరీ అయిపోయింది. సెర్చింజన్‌గా గూగుల్ సక్సెస్ స్టోరీ అలాంటిది. కానీ తనే స్వయంగా ఒక స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌ను తీసుకువచ్చినా గూగుల్ సక్సెస్ కాలేకపోయింది. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయడం కాదు కదా... ఆ మొబైల్ వాడేవారిని చూడటం కూడా అరుదే. మరి గూగుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన ముద్ర ఎందుకు వేయలేకపోయింది?
పేరు వినపడకపోవడమే ప్రాబ్లమా?
గూగుల్ పిక్సెల్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను అస్సలు విడుదల చేయలేదు. కంపెనీ లాంచ్ చేసినవన్నీ ప్రీమియం, మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లు తప్ప మనదేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసే రూ.20 వేల లోపు సెగ్మెంట్‌లో గూగుల్ పిక్సెల్ ఒక్క ఫోన్ కూడా లాంచ్ చేయలేదు. బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేయడం ద్వారా చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ, రియల్‌మీ, ఐకూ, వివో, ఒప్పో వంటి స్మార్ట్ ఫోన్ కంపెనీలు టైర్-2, టైర్-3 నగరాల్లోకి కూడా చొచ్చుకుపోయాయి. ఐటెల్, ఇన్‌ఫీనిక్స్ లాంటి కంపెనీలు కూడా బడ్జెట్ ఫోన్లతో తమకంటూ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాయి.
మరోవైపు ప్రీమియం విభాగంలో కూడా యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లు దూసుకుపోతున్నాయి. యాపిల్‌కు బ్రాండ్ వాల్యూ అనేది చాలా పెద్ద ప్లస్. ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ బ్రాండ్లలో వన్‌ప్లస్ మొదట కొన్నాళ్లు ఏకఛత్రాధిపత్యం చూపించింది. అయితే ఆక్సిజన్ఓఎస్‌కు చేసిన మార్పులు ఫెయిల్ అవ్వడంతో వన్‌ప్లస్ క్రమంగా తన మార్కెట్ వాల్యూను కోల్పోయింది. కానీ గూగుల్ పేరు మాత్రం ఎప్పుడూ ఈ సెగ్మెంట్లో వినిపించలేదు.
దానికి అనేక కారణాలు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లో ప్లస్ పాయింట్ ఏంటి అంటే... కెమెరా, ప్యూర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం (బ్లోట్ వేర్ లేకుండా) తప్ప మరో మాట కూడా వినిపించదు. గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్లు ‘వాల్యూ ఫర్ మనీ’ కాదు అనే ముద్ర బలంగా పడిపోయింది. టెక్నాలజీ మీద విపరీతమైన ఆసక్తి ఉన్నవారు, ఒక్కసారికి కొత్తగా ప్రయత్నిద్దాం అనుకునే వారు తప్ప ఎక్కువ మంది యూజర్లు గూగుల్ పిక్సెల్‌ను ఎక్కువగా పట్టించుకోలేదు.
సెర్చింజన్‌గా ఓకే... మరి స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా...
గూగుల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్. ఎవరికి ఏ సమాచారం కావాలన్నా అందులో దొరుకుతుంది. ఆ బ్రాండ్ వాల్యూ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కంపెనీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. గూగుల్ కూడా భారత్‌ను పెద్ద మార్కెట్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు. భారతదేశంలో గూగుల్ పిక్సెల్ చేసుకున్న ప్రచారం కూడా అంతంత మాత్రమే. భారతదేశంలో ఈ ఫోన్ల అందుబాటు కూడా అంతంత మాత్రమే. స్టోర్లలో కూడా ఎక్కువగా విక్రయించదు. ఆన్‌లైన్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా కొనుగోలు చేయవచ్చు.
సర్వీస్ సెంటర్లూ అంతంత మాత్రమే...
గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ అంతంత మాత్రంగానే ఉండటానికి మరో కారణం సర్వీస్ సెంటర్ల కొరత. దేశం మొత్తం మీద గూగుల్ పిక్సెల్‌కు ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు గట్టిగా 30 కూడా ఉండవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు సర్వీస్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ పట్నంల్లో ఈ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. ఫోన్‌లో ఏదైనా చిన్న సమస్య తలెత్తినా అందుబాటులో సర్వీస్ సెంటర్ లేకపోతే ఒక్కసారి ఫోన్ కొన్న యూజర్ మరోసారి ఫోన్ కొనడానికి ఇష్టపడడు. కాబట్టి ఈ విషయాల్లో మెరుగుపడకపోతే గూగుల్ ఎప్పటికీ భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌ను క్రాక్ చేయలేదు.