భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తిరిగి పుంజుకునేందుకు సిద్ధం అయ్యాయి. చైనా మొబైల్ ఫోన్ కంపెనీలకు మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్ గట్టి పోటీని ఇచ్చేందుకు కొత్త వ్యూహాన్ని రచించాయి. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం, రూ. 5000 కంటే తక్కువ బడ్జెట్‌లో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లను అందించడం ద్వారా కంపెనీలు మార్కెట్లో తిరిగి సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. స్వదేశీ బ్రాండ్ మైక్రోమ్యాక్స్ రూ. 5,000 రూపాయల రేంజ్‌లో త్వరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అలాగే Lava రూ. 10,000 కంటే తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి రెడీ అవుతుంది. అయితే చైనీస్ బ్రాండ్లు రెడ్‌మీ, రియల్‌మీ, ఇన్‌ఫీనిక్స్ గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది.


ప్రస్తుతం భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సగానికి పైగా చైనా కంపెనీలు ఆక్రమించాయి. కార్బన్ తన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 4,999 ధరకు త్వరలో విడుదల చేయనుందని తెలుస్తోంది. దీంతోపాటు మైక్రోమ్యాక్స్ రూ.5,999కే 4జీ స్మార్ట్ ఫోన్ ను అందించనుంది. లావా గత సంవత్సరం బ్లేజ్ 5జీ, బ్లేజ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. దీని ధర రూ. 10,000 కంటే తక్కువ. స్వదేశీ సంస్థ లావా జూన్‌లో రూ.21,999 ధరతో లావా అగ్ని 2ని పరిచయం చేసింది.


స్టాటిస్టా లెక్కల ప్రకారం 2023లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఆదాయం 41.73 బిలియన్ యూఎస్ డాలర్లు. మార్కెట్ వార్షికంగా 7.20% (CAGR 2023-2028) వద్ద వృద్ధి చెందుతుందని అంచనా. గ్లోబల్‌తో పోల్చితే చైనాలో అత్యధిక ఆదాయం సమకూరుతోంది. 2023లో ఇప్పటివరకు ఇది 119.20 బిలియన్ డాలర్లుగా నమోదైంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 2028 నాటికి ఉపయోగించే యూనిట్ల సంఖ్య 234.50 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 2024లో 5.9 శాతం వాల్యూమ్ వృద్ధిని చూపుతుందని అంచనా.


మార్కెట్లో ఈ దేశీయ బ్రాండ్‌లు
మైక్రోమ్యాక్స్ కంపెనీని 2000 సంవత్సరంలో స్థాపించారు. ఇది ఇప్పటికీ భారతదేశంలో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తుంది. మిడ్ రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తుంది. లావా 2009 సంవత్సరంలో స్థాపితం అయింది. ప్రధానంగా బడ్జెట్ విభాగంలో గ్లోబల్ మార్కెట్‌లో సరికొత్త టెక్నాలజీ, ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. ఇది కాకుండా మొబైల్ ఫోన్ తయారీలో తమ స్థానాన్ని కలిగి ఉన్న కార్బన్, ఇంటెక్స్, ఇండిగో వంటి భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి.


చైనీస్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే తన కొత్త 5జీ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ నోట్ 30 5జీ. ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరాను కంపెనీ అందించడం విశేషం. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ నోట్ 30 5జీ పని చేయనుంది. ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది.


ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు స్టోరేజ్ పెంచుకునే అవకాశం ఉంది.










Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!