టెక్ దిగ్గజం యాపిల్ మూడు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ట్రేడింగ్ డేని ముగించిన మొదటి పబ్లిక్‌ ట్రేడెడ్ కంపెనీగా అవతరించింది. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.246 లక్షల కోట్లు. శుక్రవారం కంపెనీ షేరు 2.31 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీని స్టాక్ ఈ సంవత్సరం దాదాపు 46 శాతం లాభపడింది. గిజ్మోచైనా వార్తల ప్రకారం 2022లో యాపిల్ మార్కెట్ క్యాప్ తాత్కాలికంగా మూడు ట్రిలియన్ డాలర్లను దాటింది. కానీ ఆ స్థాయిని కొనసాగించడంలో విఫలమైంది.


కీలకపాత్ర ఐఫోన్‌దే
2023లో యాపిల్ అద్భుతమైన స్టాక్ మార్కెట్ విజయానికి చోదక శక్తి దాని ప్రధాన ఉత్పత్తి ఐఫోన్. మొత్తం రెండు బిలియన్ యూనిట్ల అమ్మకాలతో కంపెనీ వార్షిక ఆదాయానికి ఐఫోన్ ప్రధాన సహకారిగా కొనసాగుతోంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ ఆధిపత్యం యూఎస్, చైనా రెండింటిలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికాలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొదటి ఐదు స్మార్ట్‌ఫోన్‌ల్లో ఐఫోన్ 50 శాతం కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉంది. అదేవిధంగా చైనీస్ మార్కెట్‌లో కూడా ఐఫోన్ గణనీయమైన ఆధిక్యంలో ఉంది. టాప్ ఫైవ్ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లలో నాలుగు స్మార్ట్ ఫోన్లు యాపిల్‌వే ఉన్నాయి.


ఐఫోన్ ఆదాయం ఎంత?
ఇటీవల మార్కెట్ సవాళ్లు ఉన్నప్పటికీ మార్కెట్లో యాపిల్ తన నిలకడను కొనసాగించింది. 2023 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐఫోన్ ఆదాయం 51.334 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలోని పనితీరును అధిగమించి ఒకే త్రైమాసికంలో కొత్త రికార్డును నెలకొల్పింది. ఇప్పటికే ఏఐని అడాప్ట్ చేసుకున్న Microsoft, Google, Nvidia, Meta వంటి సంస్థల కంటే యాపిల్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియాతో సహా మరో నాలుగు అమెరికా కంపెనీల విలువ ప్రస్తుతం 1 ట్రిలియన్ డాలర్ కంటే ఎక్కువ.


యాపిల్ ఇటీవల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజన్ ప్రోని విడుదల చేసింది. హెడ్‌సెట్ వచ్చే ఏడాది అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని ధరను 3,499 డాలర్లుగా నిర్ణయించారు. అంటే మనదేశ కరెన్సీలో దాదాపు రూ.2.8 లక్షలు.


యాపిల్ భారతదేశంలో యూనివర్సిటీ స్టూడెంట్స్‌కు ఒక ప్రమోషనల్ డీల్‌ను అందిస్తుంది. ‘బ్యాక్ టు యూనివర్సిటీ 2023’ అనే పేరుతో జరుగుతున్న ఈ ప్రచారం యాపిల్ ఐప్యాడ్, మ్యాక్‌బుక్‌లు, డెస్క్‌టాప్ కంప్యూటర్లపై భారీ డిస్కౌంట్ కూడా అందించనున్నారు. ఐప్యాడ్ ప్రో 11 అంగుళాలు, 12.9 అంగుళాలు, ఐమ్యాక్ 24 అంగుళాల మోడల్స్‌ను ఈ సేల్‌లో తక్కువ రేట్లకు కొనుగోలు చేయవచ్చు. యాపిల్ తన ఉత్పత్తులపై ఉచితంగా ఎయిర్‌పోడ్స్, ఇతర ఉత్పత్తులను కూడా అందిస్తుంది. దీంతో పాటు యాపిల్ కేర్ ప్లస్ ప్లాన్లపై 20 శాతం తగ్గింపు కూడా అందించనున్నారు. ఈ ఆఫర్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు చోట్లా అందుబాటులో ఉండనుంది.


బ్యాక్ టు యూనివర్సిటీ సేల్ కింద యాపిల్ ఉత్పత్తులను స్టూడెంట్లతో పాటు టీచర్లు, స్టాఫ్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. జూన్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు యాపిల్ బీకేసీ, యాపిల్ సాకేత్, యాపిల్ ఆన్‌లైన్ స్టోర్లలో ఈ సేల్ జరగనుంది.











Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!