Whatsapp in old iPhones: వాట్సాప్ త్వరలో కొన్ని పాత ఐఫోన్ మోడళ్లలో పనిచేయడం ఆగిపోనుంది. ఒక నివేదిక ప్రకారం 2025 మే 5వ తేదీ నుంచి వాట్సాప్‌ను ఐఫోన్లలో ఉపయోగించాలంటే ఐవోఎస్ 15.1 లేదా అంతకంటే కొత్త వెర్షన్ తప్పనిసరి. అంటే ఐవోఎస్ 12.5.7 కంటే పైన వెర్షన్లు ఉపయోగించే ఐఫోన్ వినియోగదారులు కొత్త డివైస్‌ను కొనుగోలు చేయాల్సిందే. వాట్సాప్‌ను అప్‌డేట్ చేయకుండా వాడుకునే సౌలభ్యం ఉందో లేదో తెలియరాలేదు.


ఏ ఐఫోన్లపై ప్రభావం పడుతుంది?
WABetainfo నివేదిక ప్రకారం ఈ అప్‌డేట్ iOS 15.1 లేదా అంతకంటే ముందు వెర్షన్లు ఉపయోగించే ఐఫోన్లను మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే iOS 15.1 లేదా ఆ తర్వాతి వెర్షన్‌ని కలిగి ఉన్న యూజర్లకు ఎలాంటి సమస్య ఎదురవదు.


ప్రస్తుతం వాట్సాప్ ఐవోఎస్ 12, అంతకంటే తర్వాతి వెర్షన్లు ఉపయోగించే ఫోన్లకు సపోర్ట్ చేస్తుంది. కానీ రాబోయే అప్‌డేట్ తర్వాత ఇది ఐవోఎస్ 15.1 లేదా కొత్త వెర్షన్‌లలో మాత్రమే రన్ అవుతుంది. అంతకంటే తక్కువ వెర్షన్లు వాడే వినియోగదారులకు సిద్ధం కావడానికి వాట్సాప్ ఐదు నెలల సమయం ఇచ్చింది. ఈ సమయంలో వారు తమ డివైస్‌ను అప్‌డేట్ చేయవచ్చు లేదా కొత్త ఐవోఎస్ వెర్షన్‌కు సపోర్ట్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.


ఎఫెక్ట్ అయ్యే ఐఫోన్ మోడల్స్ ఇవే...
వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ మార్పు వల్ల ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ఫోన్లు ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఐఫోన్‌లు 10 సంవత్సరాల క్రితం లాంచ్ అయ్యాయి. కాబట్టి ఈ మోడల్‌లలో వాట్సాప్‌ని వాడుతున్న వినియోగదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.


Also Read: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!


వాట్సాప్ ఎందుకు ఇలా చేస్తోంది?
పాత ఐఫోన్‌లకు మద్దతును నిలిపివేయడానికి ప్రధాన కారణం ఐవోఎస్ కొత్త వెర్షన్‌లలో అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతలు, ఏపీఐలను ఉపయోగించడం అని WABetainfo చెప్పింది. కొత్త ఐవోఎస్ వెర్షన్లు... అప్‌డేట్ చేసిన ఫీచర్లు, టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఇది వాట్సాప్ కొత్త ఫీచర్‌లను డెవలప్ చేయడంలో, దాని యాప్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పాత వెర్షన్లకు సపోర్ట్‌ను నిలిపివేయడం ద్వారా వాట్సాప్ దాని వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించగలదు.


ఇది కాకుండా పాత ఐవోఎస్ వెర్షన్‌లో యాక్టివ్ యూజర్ల సంఖ్యను వాట్సాప్ తప్పనిసరిగా అనలైజ్ చేసి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా చాలా తక్కువ మంది వినియోగదారులు పాత వెర్షన్‌పై ఆధారపడి ఉన్నారని తెలుస్తోంది. అందువల్ల వాట్సాప్ ఇప్పుడు కొత్త ఐవోఎస్ వెర్షన్‌పై దృష్టి పెట్టవచ్చు. దాని వినియోగదారులలో చాలా మందికి మెరుగైన ఫీచర్‌లను అందించడానికి పని చేస్తుంది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 400 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. తమ యూజర్ల కోసం వాట్సాప్ తన యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకు వస్తూనే ఉంటుంది.



Also Read: అమెజాన్‌లో మంచి డిస్కౌంట్ ఉన్న బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్ ఇవే - లిస్ట్‌లో హెచ్‌పీ, లెనోవో కూడా!