iPhone 14 Series SE 3 To Be Discontinued: రాబోయే కొద్ది రోజుల తర్వాత యాపిల్ తన మూడు ఐఫోన్ మోడల్‌లను యూరోపియన్ యూనియన్ (EU)లో విక్రయించబోదు. డిసెంబర్ 28వ తేదీ నుంచి ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ ఎస్ఈ 3 కంపెనీ యూరోప్‌లో నిలిపివేయనుంది. ఈ ఫోన్‌లన్నీ లైట్నింగ్ కనెక్టర్‌తో వస్తాయి. యూరోపియన్ యూనియన్ నిబంధనల ప్రకారం అటువంటి కనెక్టర్ ఉన్న ఫోన్ల అమ్మకం వచ్చే ఏడాది నుంచి నిషేధితం అవుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 28వ తేదీ నుంచి ఐరోపాలోని మొత్తం 27 దేశాల్లో యాపిల్ తమ విక్రయాలను నిలిపివేస్తోంది.


యూరోప్ నియమాలు ఏం చెబుతున్నాయి?
2022లో యూరోపియన్ యూనియన్ తన మొత్తం 27 దేశాలలో విక్రయించే ఫోన్లు, కొన్ని ఇతర గాడ్జెట్లు యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌లను కలిగి ఉండాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రతిపాదనను తీసుకువచ్చినప్పుడు యాపిల్ దానిని సవాలు చేసింది. కానీ 2023లో యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో ఐఫోన్ 15ను లాంచ్ చేసింది. అదేవిధంగా యాపిల్ క్రమంగా తన అన్ని ఐప్యాడ్‌ల్లో యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌లను అందించడం ప్రారంభించింది. 



Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!


స్విట్జర్లాండ్‌లో అమ్మకాలు ముందే ఆగిపోవచ్చు
స్విట్జర్లాండ్‌లో వీటి విక్రయాలు డిసెంబర్ 20వ తేదీ నుంచి ఆగిపోవచ్చు. స్విట్జర్లాండ్ యూరోప్‌లో భాగం కానప్పటికీ, అందులోని అనేక చట్టాలు ఈయూ లాగానే ఉన్నాయి. యూరప్, స్విట్జర్లాండ్‌తో పాటు ఈ నిర్ణయం ఉత్తర ఐర్లాండ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ మూడు మోడళ్ల అమ్మకం ఇక్కడ కూడా ఆగిపోతుంది.


భారతదేశంలో కొనసాగనున్న విక్రయాలు
ఈ నిర్ణయం భారతదేశంలో ఎటువంటి ప్రభావం చూపదు. ఐఫోన్ 14 విక్రయం ఇక్కడ కొనసాగుతుంది. వాటిని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. భారత ప్రభుత్వం కూడా యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌కు సంబంధించి నిబంధనలను తీసుకురావడాన్ని పరిశీలిస్తోంది. వచ్చే ఏడాది జూన్ నుంచి భారతదేశంలో కూడా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లకు యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని నివేదికలు వస్తున్నాయి. 2026 నుంచి ల్యాప్‌టాప్‌లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెబుతున్నారు.



Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?