Lava Blaze Duo 5G Launched: లావా బ్లేజ్ డ్యుయో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో శుక్రవారం లాంచ్ అయింది. ఇందులో ఫోన్ వెనకవైపు సెకండరీ డిస్‌ప్లేను కూడా అందించారు. అక్టోబర్‌లో లాంచ్ అయిన లావా అగ్ని 3 తర్వాత కంపెనీ తీసుకొచ్చిన ఫోన్ ఇదే. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ఫోన్ వెనకవైపు 1.58 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది.


లావా బ్లేజ్ డ్యుయో 5జీ ధర (Lava Blaze Duo 5G Price in India)
ఈ ఫోన్ మనదేశంలో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,499గా నిర్ణయించారు. ఆర్కిటిక్ వైట్, సెలెస్టియల్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


డిసెంబర్ 20వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్ కింద 6 జీబీ ర్యామ్ మోడల్‌ను రూ.16,999కి, 8 జీబీ ర్యామ్ మోడల్‌ను రూ.17,999కు కొనుగోలు చేయవచ్చు. డిసెంబర్ 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు. అంటే రూ.14,999కే ప్రారంభ వేరియంట్ కొనేయచ్చన్న మాట.



Also Read: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?


లావా బ్లేజ్ డ్యుయో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Lava Blaze Duo 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై లావా బ్లేజ్ డ్యుయో 5జీ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌ను కూడా ఇది రిసీవ్ చేసుకోనుంది. ఇందులో 6.67 ఫుల్ హెచ్‌డీ+ 3డీ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించనున్నారు. 1.58 అంగుళాల అమోఎల్ఈడీ స్క్రీన్‌ను వెనకవైపు అందించారు. ప్రధాన డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ కూడా అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు రెండు సెన్సార్లు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా అందించారు. లావా బ్లేజ్ డ్యుయో 5జీలో సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫింర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 186 గ్రాములుగా ఉంది.



Also Read: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!